top of page

శ్వాసకూ ఉందట ఓ ముద్ర!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 26, 2025
  • 2 min read

వేలిముద్రల గురించి తెలియని వారెవరూ ఉండరు. ఎందుకంటే.. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ప్రభుత్వ పథకం అమల్లోనూ, వ్యక్తులను గుర్తించే విషయంలోనూ బయోమెట్రిక్‌ ఐడెంటిఫికేషన్‌ విధా నాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆయా వ్యక్తుల వేలిముద్రలు లేదా ఐరిస్‌ అంటే కనుపాప ముద్రలు తీసుకుని ఈ కేవైసీ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఇదెందుకు ప్రస్తావిస్తున్నా మంటే.. వేలిముద్రల మాదిరిగానే మనం తీసుకునే శ్వాసకు కూడా ఒక ప్రత్యేక ముద్ర ఉంటుందని శాస్త్రవేత్తలు తాజాగా నిర్థారించడమే విశేషం. వేలిముద్రలు ఒకే మనిషికి చెందిన రెండు వేళ్లతో సరి పోలవు.. అలాగే ఏ ఇద్దరు మనుషుల వేలిముద్రలూ ఒకేలా ఉండవు. శ్వాసముద్ర కూడా అచ్చం ఇలాగే ఉంటుందట! ఒక మనిషి ఆలోచనలు, ఆరోగ్యం ఎలా ఉన్నాయన్నది ఈ శ్వాసముద్ర కచ్చితంగా చెప్పేసే పరిస్థితి ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని చాలామంది చెబుతుంటారు. అయితే ఇది కేవలం నమ్మకమా లేక శాస్త్రీయంగా నిరూపితమైందా అనే సందేహం ఉండేది. ఈ సందేహాలకే ఇప్పుడు స్పష్ట మైన శాస్త్రీయ ఆధారం లభించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సంస్థ వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన న్యూరో బయాలజీ ప్రొఫెసర్‌ నోమ్‌ సోబెల్‌ నేతృత్వంలోని బృందం నిర్వహించిన పరి శోధన అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. శ్వాస తీరుతెన్నులకు, వ్యక్తుల భావోద్వేగాలూ ఆరోగ్య స్థితిగతేలకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో జరిపిన ఈ అధ్యయన ఫలితాలు కరెంట్‌ బయాలజీ అనే ప్రఖ్యాత జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా వంద మందికి పైగా వ్యక్తుల శ్వాస తీరును 24 గంటల పాటు నిశితంగా పరిశీలించి, విశ్లేషించారు. ఈ అధ్యయనం కోసం వారి ముక్కు వద్ద ప్రత్యేకమైన సెన్సర్‌ పరికరాలు అమర్చారు. వారు నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా.. ఇలా అన్ని సమయాల్లోనూ వారి శ్వాస తీరును నిరంతరం ట్రాక్‌ చేశారు. వాటిని విశ్లేషించగా అత్యంత ఆశ్చర్యకరమైన ఫలితాలు లభించాయి. ప్రతిఒక్కరి శ్వాసతీరు ఇతరుల శ్వాస ముద్రతో సరిపోలకుండా 96.8 శాతం వరకు ప్రత్యేకంగా ఉన్నట్టు తేలింది. అంటే మన వేలిముద్రలే కాదు, మన శ్వాస ముద్ర కూడా ఎంతో ప్రత్యేకమైనదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇది ఒకరిని మరొకరి నుంచి వేరు చేసే ఒక విశిష్టమైన జీవ కారకం అని రుజువు చేసింది. మరింత కీలక అంశం ఏమిటంటే వ్యక్తుల శ్వాస తీరు ద్వారా వారి మానసిక స్థితి, ఆరోగ్య పరిస్థి తులను కూడా అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉదాహరణకు వ్యాకులతతో బాధపడే వారు తక్కువ గాలి పీల్చడం, శ్వాస తీసుకోవడంలో ఎక్కువ విరామాలు ఉండటం వంటి లక్షణాలను గుర్తించారు. నిద్రలో ఉన్నప్పుడు కూడా కొంతమంది శ్వాస తీరు మారుతుండగా, వ్యథ, ఆందోళనలో ఉన్నవారు మేల్కొని ఉన్నప్పుడు శ్వాసను బలవంతంగా తీసుకోవడం, ఉఛ్వాస నిశ్వాసాల మధ్య విరా మం తీసుకోవడం వంటివి కనిపించాయి. ఈ లక్షణాల ఆధారంగా భవిష్యత్తులో మనుషుల్లోని మానసిక వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది డయాగ్నస్టిక్‌ రంగం లో ఒక విప్లవాత్మక మార్పుకు దారితీసే అవకాశం ఉంది. ఈ పరిశోధన తెలియజేస్తున్న అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మనం తీసుకునే శ్వాస తీరును మార్చుకుంటే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని ప్రొఫెసర్‌ నోమ్‌ సోబెల్‌ చెబుతున్నారు. ధ్యానం, శ్వాసా భ్యాసం (ప్రాణాయామం) వంటి యోగా పద్ధతులు ఆధ్యాత్మిక పద్ధతులు మాత్రమే కాదని.. శాస్త్రీయంగా కూడా అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఈ అధ్యయనం మరోసారి నిరూపించింది. శ్వాసను నియం త్రించడం ద్వారా మన నాడీ వ్యవస్థపై, తద్వారా మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపవచ్చని ఇది స్పష్టం చేసింది. ఇప్పటివరకు మౌఖికంగా చెప్పుకొచ్చిన ‘శ్వాస మీద ధ్యాస’ మహత్యం ఇప్పుడు శాస్త్ర విజ్ఞానంతో బలపడిరది. ప్రతి ఒక్కరి శ్వాస ముద్ర ప్రత్యేకమని, దాన్ని అధ్యయనం చేయడం ద్వారా అనేక రుగ్మతలను ముందుగానే గుర్తించవచ్చని ఈ పరిశోధన తెలుపుతోంది. యోగా, ధ్యానం చేసే వారి ఆరోగ్య ప్రయోజనాలకు ఇది ఒక బలమైన శాస్త్రీయ మద్దతు. శ్వాస మీద ధ్యాస పెడితే ఆయురారోగ్యాలు సమకూరుతాయనే మాట ఇక ఎంతమాత్రం కేవలం నమ్మకం కాదు. అది ఒక తిరుగు లేని శాస్త్రీయ సత్యమని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలు ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page