top of page

శిష్టకరణ సారధులు ఆర్‌వీఎన్‌ శర్మ, వినోద్‌

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jan 5
  • 2 min read
  • నగర సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు

  • జిల్లా సంఘానికి మండలస్థాయి కమిటీలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగర శిష్టకరణ సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్‌వీఎన్‌ శర్మ, గజరావు వినోద్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఆదివారం స్థానిక శిష్టకరణ సామాజిక భవనంలో జిల్లా అధ్యక్షుడు డబ్బీరు శ్రీనివాసరావు (వాసు) ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక అత్యంత కోలాహలంగా జరిగింది. శర్మ, వినోద్‌లు అధ్యక్ష, కార్యదర్శులుగా పోటీలో ఉన్నారని ప్రకటించడంతో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతమంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై గ్రూపులకు అతీతంగా వీరిద్దర్నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు కోశాధికారిగా కుప్పిలి రవికుమార్‌, సహాధ్యక్షులుగా పెదపెంకి శ్రీరామ్‌కుమార్‌, కళ్లేపల్లి వెంకటేశ్వరరావులు ఎన్నికయ్యారు. తాజా, మాజీ అధ్యక్షుడు బెహరా రామచంద్రరావును సంప్రదాయం మేరకు గౌరవాధ్యక్షునిగా నిలిపారు. ఉపాధ్యక్షుడిగా ఉరిటి చిట్టిదాస్‌, డబ్బీరు వెంకటరావు, చౌదరి దివాకర్‌, బెహరా సతీష్‌లను ఎంపిక చేశారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా నౌపడ సుధాకర్‌, సహాయ కార్యదర్శులుగా డీవీ రమణమూర్తి, కోడూరు సురేష్‌కుమార్‌, అల్లెన రాధాకృష్ణ, చౌదరి శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. లీగల్‌సెల్‌ కన్వీనర్లుగా బలివాడ గోవిందరావు, ఆరికతోట కృష్ణంరాజులను నియమించారు. ముఖ్య సలహాదారులుగా కుప్పిలి కృష్ణమూర్తి, ఎన్‌వీ కామేశ్వరరావు పట్నాయిక్‌, కేఎన్‌బీ ప్రసాద్‌లను నియమించారు. అలాగే ఈ సందర్భంగా సంఘ సభ్యులు కుప్పిలి నర్సింహమూర్తి, డాక్టర్‌ శ్రీనివాస్‌ పట్నాయిక్‌, బలివాడ శివప్రసాద్‌, నందిగాం కోటేశ్వరరావుల సేవలను గుర్తించి గజరావు మురళీ ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన అధ్యక్షుడు ఆర్‌వీఎన్‌ శర్మ మాట్లాడుతూ సంఘ పటిష్ఠతకు, సామాజిక భవనం అభివృద్ధికి, శిష్టకరణం సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా సంఘ గౌరవాధ్యక్షులు బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా శిష్టకరణ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతపరిచే అవకాశం ఉంటుందన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు పోలుమహంతి ఉమామహేశ్వరరావు రాష్ట్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు.

నగరానికి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించాలనే కసరత్తు మొదలైన దగ్గర్నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలామంది నగర కమిటీలో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తేలింది. అయితే ఆర్‌వీఎన్‌ శర్మ, వినోద్‌ల అభ్యర్థిత్వాన్ని మాత్రం ఎవరూ వ్యతిరేకించలేదు. దీంతో అర్హత ఉన్నా నగర సంఘంలో స్థానం దక్కలేదని భావించిన శిష్టకరణ నాయకులు కొందరిని జిల్లా కమిటీలోకి తీసుకున్నారు. నగరంలో కాంట్రాక్టర్‌ రుద్రమహంతి కామేష్‌ను జిల్లా కమిటీలోకి తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు వాసు సభాముఖంగా ప్రకటించారు. ఆర్‌వీఎన్‌ శర్మ, వినోద్‌ల కలయిక డబుల్‌ ఇంజిన్‌గా ఉంటుందని, రెండు తరాలకు ప్రతినిధులైన వీరిద్దరి నేతృత్వంలో నగర కమిటీ మరింత బలపడుతుందని బలివాడ మల్లేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లాలో ఇంతవరకు శిష్టకరణాలు ఎంతమంది ఉన్నారన్న సంఖ్య ఇతిమిద్ధంగా తేలలేదని, త్వరలోనే గణన ప్రారంభించడానికి అధ్యక్ష, కార్యదర్శులతో కూడిన కొత్త కమిటీ తీర్మానించుకుంది. ఈమేరకు నగరంలో ఉన్న 50 డివిజన్లలో శిష్టకరణాలను గుర్తించి, ప్రతిఒక్కరికీ ఒక ఐడెంటిటీ నెంబరు ఇవ్వడానికి కసరత్తు ప్రారంభమైంది. ఐటీ రంగం నుంచి వచ్చిన కొత్త కార్యదర్శి వినోద్‌కు దీని మీద నాలెడ్జ్‌ ఉండటం, అధ్యక్షుడు శర్మకు అనుభవం ఉండటంతో త్వరలోనే నగరంలో శిష్టకరణాల జాబితా సిద్ధం కానుంది. ఇదే సమయంలో దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారు ఎంతమందో గుర్తించి ఒక పద్ధతి ప్రకారం సహకారం అందించడానికి అవకాశం ఉంటుందని శర్మ, వినోద్‌లు పేర్కొన్నారు. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు డబ్బీరు శ్రీనివాసరావు త్వరలోనే మండలాల వారీగా కార్యవర్గాన్ని నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి నగర ఎన్నికకు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో విశాఖపట్నం నుంచి రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌, గతంలో ఇక్కడ ఆర్డీవోగా పని చేసిన సాలూరు వెంకటేశ్వరరావు, వీఎంఆర్‌డీఏ ఎస్టేట్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బలివాడ దయానిధిలతో పాటు సదాశివుని కృష్ణ, గోవింద్‌ పట్నాయిక్‌, పట్నాయకుని మధుసూదనరావు (సత్యసాయి మధు) తదితరులు పాల్గొన్నారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page