షర్మిల వైఖరి అధిష్టానానికి చేర్చాలి
- NVS PRASAD
- 6 days ago
- 1 min read

విశాఖపట్నంలో సమావేశమైన కాంగ్రెస్ శ్రేణులు
(సత్యంన్యూస్, విశాఖపట్నం)
రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సర కాలంగా పీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్ర పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి పద్మశ్రీ, అనకాపల్లి మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీరామ్మూర్తి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశానికి విజయనగరం మాజీ డీసీసీ అధ్యక్షులు సరగడ రమేష్‌కుమార్ అధ్యక్షత వహించారు. కేంద్ర మాజీమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న 26 జిల్లాలకు చెందిన పలువురు మాజీ డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి నిరంకుశత్వంతో నేడు రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని, ఎన్నికలు జరిగిన నాటి నుంచి నేటివరకు రాష్ట్రంలో పార్టీ విధ్వంశానికి పీసీసీ నాయకత్వం కృషి చేస్తోంది తప్ప పార్టీ అభివృద్ధికి పని చేయడంలేదని వారు ధ్వజమెత్తారు. ఈ విషయాలన్నింటినీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలకు తెలియజేయాలని శ్రీకాకుళం డీసీసీ మాజీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు చేతుల మీదుగా అన్ని జిల్లాల నుంచి వినతిపత్రాలను కృపారాణికి అందజేశారు.
Comments