‘స్థానిక’ ప్రతినిధులపై సిరికన్ను!
- BAGADI NARAYANARAO
- Jul 3
- 3 min read
గౌరవ వేతనాలకు నోచుకోని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు
ఎంపీపీలు, జెడ్పీ ఛైర్‌పర్సన్‌దీ అదే దుస్థితి
33 నెలల బకాయిలు పెండిరగ్ పెట్టారని ఆవేదన
మూడుసార్లు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసినా నిధుల్లేక ల్యాప్స్
మొత్తం రూ.82 లక్షల బకాయిలు ఉన్నట్లు అంచనా

తమకు జీతాలు సక్రమంగా అందడం లేదని సాధారణంగా ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆరోపిస్తుంటారు, ఆందోళనలు చేస్తుంటారు. కానీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పరిపాలనలో భాగస్వాములవుతున్నవారు కూడా జీతాల బాధితులేనని తాజాగా తెలిసింది. ఇలా జీతాలు అందని ప్రజాప్రతినిధులు ఎంపీ, ఎమ్మెల్యేలు కాదు.. గ్రామ స్వపరిపాలనను సాకారం చేయాల్సిన స్థానిక సంస్థల ప్రతినిధులైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు. ఆ మధ్య జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో జి.సిగడాం జెడ్పీటీసీ ఇదే విషయాన్ని ప్రస్తావించి, వెంటనే జీతాలు చెల్లించేలా చొరవ చూపాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడుకు విజ్ఞప్తి చేశారు. కానీ నాలుగు నెలలైనా ఇంతవరకు స్పందన లేదు.
జిల్లాలో జెడ్పీ ఛైర్‌పర్సన్‌తోపాటు జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం సుమారు రూ.82 లక్షలు బకాయి పడినట్లు జిల్లాపరిషత్ అధికారులు చెబుతున్నారు. వీరి జీతాల బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసినా నిధులు రిలీజ్ కావడం లేదంటున్నారు. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్‌పర్సన్‌తో సహా 38 మంది జెడ్పీటీసీలు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు.. మొత్తం 40 మంది ఉన్నారు. జెడ్పీ ఛైర్‌పర్సన్‌కు రూ.40 వేలు, జెడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులకు రూ.ఆరు వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. 2022 సెప్టెంబర్ నుంచి 2023 జులై వరకు 11 నెలల గౌరవ వేతనాలకు సంబంధించి రూ.26.90 లక్షల బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో జిల్లా అధికారులు అప్‌లోడ్ చేశారు. అయినా నిధులు విడుదల కాకపోవడంతో అవి మూడుసార్లు ల్యాప్స్ అయ్యాయి. ఆ తర్వాత 2023 ఆగస్టు నుంచి 2025 మార్చి వరకు 20 నెలల గౌరవ వేతన బకాయిలు రూ. 54.80 లక్షలు పేరుకుపోయాయి. ప్రభుత్వం వీటికి గ్రాంటే రిలీజ్ చేయలేదని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలల గౌరవ వేతనాలు కూడా అందలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2025`26 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.33.06 లక్షలు కేటాయించింది. ఈ బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. పాత బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేస్తే తప్ప ఆ బిల్లులను అప్‌లోడ్ చేయలేరు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగా ఇప్పటి వరకు ఉన్న బకాయిల వివరాలు పంపించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. ఆ మేరకు జెడ్పీ అధికారులు వివరాలు పంపినట్లు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.33 లక్షలు గ్రాంట్ విడుదల చేసినా సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయడానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. 2021 అక్టోబర్‌లో పదవుల్లోకి వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సుమారు నాలుగేళ్ల పదవీ కాలంలో కేవలం 11 నెలల గౌరవ వేతనం మాత్రమే అందుకున్నారు. ఇంకా 33 నెలల వేతనాలు పెండిరగ్‌లో ఉన్నాయి.
.సర్పంచుల పరిస్థితి కొంత నయం
మరోవైపు ఎంపీటీసీలు, సర్పంచ్‌ల గౌరవ వేతనాలు కూడా విడుదల చేయాల్సి ఉంది. సర్పంచ్‌లకు జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి.. ఎంపీపీ, ఎంపీటీసీలకు మండల పరిషత్ కార్యాలయాల నుంచి నిధులు విడుదల చేయాలి. సర్పంచ్‌లకు నెలకు రూ.మూడు వేలు చొప్పున ఆరు నెలలకోసారి గౌరవ వేతనాలు జమ చేస్తున్నారు. ఆ మేరకు గత ఏడాది డిసెంబర్ వరకు పెండిరగు ఉన్న వేతనాలను ఈ ఏడాది జనవరిలో చెల్లించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆరు నెలల గౌరవ వేతనం బకాయి ఉంది. ఎంపీటీసీలకు నెలకు రూ.మూడు వేలు చొప్పన గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. అయితే జెడ్పీటీసీల మాదిరిగానే వీరికి కూడా 11 నెలల గౌరవ వేతనాలే ఇంతవరకు చెల్లించారు. 33 నెలల వేతనాలను పెండిరగులో పెట్టేశారని స్థానిక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెట్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల పదవీ కాలం మరో ఏడాదిలో ముగుస్తున్నా గౌరవ వేతనాల చెల్లింపులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటాన్ని వారంతా తప్పు పడుతున్నారు.
నాటి సంప్రదాయాలకు చెల్లుచీటి
మండలంలో సుమారు 50 నుంచి 70 వేల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెట్పీటీసీలు జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాలకు, స్థాయి సంఘ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. దారి ఖర్చులను సొంతంగా భరిస్తూనే వారంతా రావాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీలో ఎన్నికైన బడుగు, బలహీన వర్గాల జెడ్పీటీసీలకు ఇది ఆర్ధిక భారమేనని అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెడ్పీ సర్వసభ్య, స్థాయి సంఘ సమావేశాలకు హాజరయ్యే జెట్పీటీసీలకు రవాణా అలవెన్స్‌లు చెల్లించే సంప్రదాయం ఉండేది. అలాగే గౌరవ వేతనాన్ని సమావేశాలకు వచ్చిన రోజునే కవర్‌లో పెట్టి అందించేవారు. ఆయన తదనంతరం అలవెన్స్ చెల్లించే ప్రక్రియను నిలిపేశారు. కవర్‌లో పెట్టి గౌరవ వేతనం ఇచ్చే సంప్రదాయానికి కూడా స్వస్తి పలికి సీఎఫ్‌ఎంఎస్ ద్వారా గౌరవ వేతనాలు జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2014 తర్వాత జెట్పీటీసీలు గౌరవ వేతనం అందుకోవడమే గగనమైపోయిందన్న విమర్శలు ఉన్నాయి. 2019లో ఏర్పడిన వైకాపా ప్రభుత్వం జెట్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ల వేతనాలను రెట్టింపు చేసి ఆ మేరకు 2021 సెప్టెంబర్ నుంచి 2023 జూలై వరకు 11 నెలలు మాత్రమే చెల్లించింది. ఆ విధంగా వైకాపా పాలనలో 21 నెలలు, కూటమి పాలనలో 12 నెలల గౌరవ వేతనం చెల్లించలేదు. దీనిపై పంచాయతీరాజ్ కమిషనరేట్ నివేదిక కోరిందని, బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నారని జెడ్పీ అధికారులు చెబుతున్నారు. అయితే ఎప్పటిలోగా చెల్లిస్తారో తెలియదని చెప్పడం కొసమెరుపు.
Comments