‘స్థానిక’ సీట్లపై తలోమాట.. తెస్తుందా తలపోటు
- DV RAMANA

- 22 hours ago
- 3 min read

‘రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే కొనసాగేలా మేం కలిసి ఉంటాం. చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు’.. అని స్వయంగా జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కొన్నాళ్ల క్రితం ఉవాచించారు. కూటమి ప్రభుత్వం కొనసాగడమన్నది ప్రభుత్వ పనితీరు, ఆపై ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎన్నికల్లో తప్ప ఇప్పుడప్పుడే తేలేది కాదు. ఇకపోతే కూటమి పార్టీలు కలిసి ఉండటమన్నదానిపైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సంగతేమో గానీ.. త్వరలో జరుగుతాయని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల గురించి ఇదే కూటమి పార్టీల అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు మాత్రం సరికొత్త వివాదాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేనల్లో బీజేపీ కాస్త తటస్థంగా ఉంటూ స్లీపింగ్ పార్టనర్ పాత్ర వహిస్తుండగా టీడీపీ, జనసేనలు మాత్రమే అటు ప్రభుత్వంలోనూ, ఇటు రాజకీయ వ్యవహారాల్లోనూ క్రియాశీలంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు.. అంటే సగం పదవీకాలం పూర్తికావచ్చింది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో మరో రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమవుతున్నది. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానంలో పలు పిటిషన్లు విచారణలో ఉన్నాయి. నాలుగు రోజుల క్రితమే హైకోర్టులో వీటిపై విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉందని, మొదట పురపాలక, నగరపాలక సంస్థలకు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. చివరికి సర్పంచుల ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడించింది. అయితే స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై అధ్యయనం చేస్తున్న బీసీ కమిషన్ త్వరలోనే నివేదిక ఇవ్వనుందని, ఆ రిజర్వేషన్లను వర్తింపజేస్తూ ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. దాంతో స్థానిక ఎన్నికలపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ఈ తరుణంలోనే టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడైన మంత్రి నారా లోకేష్, జనసేన పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) అధ్యక్షుడైన మరో మంత్రి నాదెండ్ల మనోహర్ పరస్పర భిన్నవ్యాఖ్యలు చేయడం కూటమి పార్టీల్లో కలకలం రేపుతున్నది. పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లోనూ కూటమి పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్నందని వెల్లడించారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన దామాషా పద్ధతినే ఫాలో అవుతామని కూడా తేల్చి చెప్పారు. దీనికి ముందే జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం సీట్ల సర్దుబాటుపై మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కోరతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరని.. అప్పటి పరిస్థితులు కూడా ఇప్పుడు లేవని కూడా వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో జనసేనకు అధిక ప్రాతినిధ్యం లభించేలా చూడటమే లక్ష్యంగా సీట్ల కేటాయింపు సందర్భంగా నిర్ణయాలు తీసుకుంటామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కానీ నారా లోకేష్ మాత్రం సాధారణ ఎన్నికల తరహాలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందని కుండబద్దలు కొట్టేశారు. అప్పట్లో అనుసరించినట్లుగానే టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి ఐదు శాతం సీట్లు కేటాయిస్తామని పార్టీ నేతల సమావేశంలో తేల్చి చెప్పేశారు. ఈ ఇద్దరి భిన్న వ్యాఖ్యలే కూటమి పార్టీల్లో దుమారం రేపుతున్నాయి. ఇద్దరు నేతలు చెప్పినవి.. ఆయా పార్టీý ఆలోచనలకు, శ్రేణుల ఆశలు అనుగుణంగా ఉన్నవే. కానీ కూటమి పరంగా చూస్తే మాత్రం వారి ఆశలు, ఆలోచనలు ఇబ్బందికరమైనవేనని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 134 సీట్లు సాధించిన టీడీపీ ఆ నియోజకవర్గాలన్నింటిలోనూ స్థానిక సంస్థల్లో పూర్తి ప్రాతినిధ్యం సాధించాలన్నది ఆ పార్టీ శ్రేణుల ఆరాటం. ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో తమ వాటాలు కోల్పోవడం, త్యాగాలు చేసిన ఛోటా నాయకులు స్థానిక ఎన్నికల్లోనూ త్యాగాలకు ససేమిరా అంటున్నారు. అదే సమయంలో జనసేన శ్రేణులు కూడా దాదాపు అదే రకమైన ఆలోచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ సీట్లకు పరిమితమై, పార్టీ బలంగా ఉన్న అనేక నియోజకవర్గాలను మిత్రపక్షమైన టీడీపీకి వదలాల్సి వచ్చిందన్నది వారి వాదన. అందువల్ల అటువంటి నియోజకవర్గాల స్థానిక సంస్థల్లో మెజారిటీ సీట్లు తమ పార్టీకే కేటాయించాలని బలంగా కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ స్టాండ్ ఏమిటన్నది ఇప్పటివరకు వెల్లడికాలేదు. కానీ మిగిలిన రెండు పార్టీల మధ్య ప్రస్తుతం సంవాదం జరుగుతున్నది. దీనిపై పార్టీ నాయకత్వాల స్థాయిలో ఇంకా అధికారిక చర్చలు ప్రారంభం కాకపోయినా రెండు పార్టీల కీలక నేతలే అగ్గి రాజేశాయి. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొంతకాలంగా నారా లోకేష్ నిర్ణయాలే పార్టీ నిర్ణయాలుగా అమలవుతున్నాయన్నది తెలిసిందే. అలాంటి ఆయన నోటి నుంచే సీట్ల సర్దుబాటు పాత పద్ధతిలోనే ఉంటుందని చెప్పారంటే అదే అమలవుతుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇదే జనసైనికులను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ రెండు పార్టీల మధ్య పైస్థాయిలో పూర్తి సమన్వయం, సహకారం కొనసాగుతున్నప్పటికీ.. నియోజకవర్గాల స్థాయిలో రెండు పార్టీల మధ్య విభేదాలు, ఘర్షణలు నానాటికీ పెరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసైనికులు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట టీడీపీ కార్యకర్తలు తమకు ప్రాధాన్యం దక్కడంలేదని ఆరోపణలు చేసుకుంటున్నారు. వనరుల దోపిడీ, ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాý అమల్లో తమను పట్టించుకోవడంలేదని పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు పరస్పర అంగీకారయోగ్యంగా జరగకపోతే మాత్రం కూటమి బీటలు వారే ప్రమాదం ఉంది.






Comments