సాధింపులు, వేధింపులే.. ఆయనకు ‘భూషణా’లు!
- DV RAMANA

- Jul 10, 2025
- 3 min read
తోటి సిబ్బందిని రాచి రంపాన పెడుతున్న అధికారి
మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యవర్తన
కులం, రాజకీయ పరపతితో పీవోనే లెక్కచేయని తత్వం
విధుల నుంచి తొలగించిన మళ్లీ రావడానికి యత్నాలు
కలెక్టర్‌కు ఛైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ల ఫిర్యాదు

ఆయన ఒక ఎన్జీవో సంస్థకు జిల్లా పర్యవేక్షకుడు. ప్రభుత్వ సంస్థకు అనుబంధంగా పని చేస్తూ రోగులకు ఆ సంస్థ సేవల గురించి వివరించడం, వారిని ఆయా కేంద్రాలకు తీసుకెళ్లి టెస్టులు, కౌన్సెలింగ్ చేయించడం, అవసరమైన మందులు ఇప్పించడం వంటి కార్యకలాపాలను తన కింది సిబ్బంది ద్వారా చేయిస్తూ, అవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించడం ఆయనగారి బాధ్యత. కానీ ఆయనగారు ఆ పని ఎలా చేస్తున్నారో గానీ.. తన కింది సిబ్బందితో తనకు సేవలు చేయించుకుంటున్నారు. పైగా వారిని దుర్భాషలాడుతూ, అవమానపర్చడమే కాకుండా కులవివక్ష కూడా చూపిస్తున్నారు. మూడు నెలల క్రితమే విధుల నుంచి తప్పించినా జిల్లావ్యాప్తంగా తనకున్న పరిచయాలతో ఉద్యోగులకు బెదిరిస్తూ, వారి పనులు కానివ్వకుండా చేస్తూ వేధిస్తున్నాడు. ఇతగాడి ఆగడాలు భరించలేక సదరు ఉద్యోగులు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే మొరపెట్టుకోవాల్సి వచ్చింది.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఎయిడ్స్ నియంత్రణ కార్యకలాపాల్లో భాగస్వాములమవుతున్న తమను.. పైఅధికారిగా పని చేసిన వ్యక్తి రకరకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని ఛైల్డ్ ఫండ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)కు చెందిన 16 మంది లింక్ వర్కర్స్ గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీశాక్స్) పరిధిలో ఛైల్డ్ ఫండ్ ఇండియా సంస్థ పని చేస్తోంది. తనకు అప్పగించిన ప్రాంతాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను, ఆ లక్షణాలు ఉన్నవారిని, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలను గుర్తించి సమీప ఏఆర్‌టీ సెంటర్లకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించి, టెస్టులు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారికి మందులు ఇప్పించడం వంటి బాధ్యతలను ఏపీశాక్స్ పరిధిలోని ఎన్జీవో సంస్థలు నిర్వర్తించాల్సి ఉంది. ఎన్జీవో పరిధిలో ఈ పనులు చేస్తున్న వారిని లింక్ వర్కర్స్ అంటారు. వీరిని పర్యవేక్షిస్తూ, పనులు సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా హెడ్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ల (డీఆర్పీ)ది. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు నెలల క్రితం వరకు ఈ పనులు నిర్వర్తించి ఛైల్డ్ ఫండ్ ఇండియా సంస్థ డీఆర్పీ హనుమంతు నాగభూషణరావుపై ఆయన కింద పని చేసిన లింక్ వర్కర్లే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
వేధింపులు, వికృత చేష్టలు
డీఆర్పీగా జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ ఫీల్డ్ విజిట్‌లు చేసే నాగభూషణరావు, తన పర్యటనలకు సంస్థ ఖర్చులు చెల్లిస్తున్నా.. తన కింద పని చేసే లింక్ వర్కర్లను వాడేసుకుంటున్నారు. ఈయనగారు జిల్లా కేంద్రం నుంచి ఫీల్డ్‌కు బయలుదేరేటప్పుడు ఇక్కడి ఉద్యోగి ఒకరు తన బైక్‌పై బస్టాండ్‌కు అలాగే ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చేటప్పుడు కూడా తీసుకురావడం, తీసుకెళ్లడం చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీల్డ్ పర్యటనకు వెళ్లేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ఆయన బస్సు దిగగానే.. అక్కడి ఉద్యోగుల్లో ఒకరు ఆయన్ను బైక్ ఎక్కించుకుని ఆయన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తిరిగి బస్సు ఎక్కించే వరకు బాధ్యత సదరు ఉద్యోగిదే. డీఆర్పీకి విపరీతమైన కులపిచ్చి ఉందని ఫిర్యాదులో ఆరోపించారు. తన మాటల్లో తరచూ కులం ప్రస్తావన వస్తుంటుందని, తన కులం కానివారిని చిన్నచూపు చూస్తూ వేధించేవారు. తన మాట వినని వారికి కావాలనే ఎక్కువ పనులు అప్పగించి ఒత్తిడి పెంచి ఇబ్బందులకు గురి చేసేవారు. కాగా మహిళ ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్టుంటారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పిన వారి వద్దకు వెళ్లాలని ఒత్తిడి చేస్తుంటారని, అలాగే వర్కర్ల ఇళ్లకు హోం విజిట్ పేరుతో వెళ్లి.. వారి స్థితిగతులు , వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వారిపట్ల అనుచితంగా ప్రవర్తించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను వివరిస్తూ డీఆర్పీ తీరుపై గతంలో ఛైల్డ్ ఫండ్ ఇండియా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి(పీవో)కి, డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్స్ కంట్రోల్ యూనిట్ డీఎల్‌వో దృష్టికి తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నాలుగు నెలల క్రితం తొలగింపు
తమ ఫిర్యాదులపై స్పందించిన పీవో శ్రీరామ్ శ్రీనివాస్ వర్చువల్‌గా డీఆర్పీ నాగభూషణరావుతో మాట్లాడి ప్రవర్తన, పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కానీ డీఆర్పీ ఆ తర్వాత నుంచి ఇంకా ఎక్కువగా వేధించడం ప్రారంభించారు. మళ్లీ ఈ విషయాన్ని పీవో దృష్టికి తీసుకెళ్లగా 16 మంది నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. వాటికి వివరణ ఇవ్వాలని డీఆర్పీని కోరగా.. ‘నా లెవల్ వేరు, నాకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. దీన్ని ఏవిధంగా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పీవో మూడు నెలల గడువు ఇచ్చి పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది మార్చిలో డీఆర్పీ నాగభూషణరావును విధులకు రాకుండా నిలిపివేశారు. అయినా ఆయన ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారిక విధుల నిర్వహణ కోసం ఏపీశాక్స్ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను ఇంతవరకు తిరిగి ఇవ్వకుండా తనవద్దే ఉంచుకున్నారు. అలాగే తనపై ఫిర్యాదు చేసిన లింక్ వర్కర్లపై బయటనుంచే కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. ఐసీటీసీ కేంద్రాల్లో తనకు పరిచయం ఉన్న, తన కమ్యూనిటీకి చెందిన పలువురు కౌన్సెలర్ల ద్వారా లింకు వర్కర్లు తీసుకువచ్చే పేషెంట్లకు కౌన్సెలింగ్ ఇవ్వకుండా, వారికి రక్తపరీక్షలు చేయకుండా అడ్డుకుంటున్నారు. వర్కర్లలో కొందరిని తన రాజకీయ పరపతి ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని లింకు వర్కర్లు తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టుకు జిల్లా ఛైర్మన్ హోదాలో కలెక్టర్ చొరవ తీసుకుని నాగభూషణరావుకు మళ్లీ డీఆర్పీగా అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
మళ్లీ రావడానికి ప్రయత్నాలు
నాలుగేళ్లుగా విధులకు దూరంగా ఉన్నా కూడా లింక్ వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగభూషణరావు మళ్లీ ఎలాగైనా అదే పోస్టులోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. గత పదేళ్లుగా జిల్లాలోనే తిష్టవేసిన ఈయన గతంలో ఏపీశాక్స్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్(డీపీఎం)గా ఉమామహేశ్వరరావు ఉన్నప్పుడు అతని సహకారంతో తన కార్యకలాపాలు సాగించేవారు. ఇతనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అవి పైస్థాయికి వెళ్లకుండా తన స్థాయిలోనే మాఫీ చేసేసేవారు. ఒకవేళ వెళ్లినా ఏపీశాక్స్ రాష్ట్ర కార్యాలయంలో కొన్నేళ్లుగా పనిచేస్తూ ప్రస్తుతం టీఐఎన్జీవో డైరెక్టర్‌గా అలాగే ఇన్‌ఛార్జి ఏపీడీగా పని చేస్తున్న కామేశ్వరప్రసాద్ అండదండలతో చర్యల నుంచి తప్పించుకుంటూ వచ్చారు. టీఐ ఎన్జీవో అంటే ఏపీశాక్స్‌కు అనుబంధంగా పని చేసే టార్గెటెడ్ ఇంట్రవెన్షన్ స్వచ్ఛంద సంస్థలు అని అర్థం. అంటే ఎయిడ్స్ నియంత్రణ కార్యకలాపాల్లో పాల్గొనే ఎన్జీవో సంస్థల పర్యవేక్షణ బాధ్యత ఈ కామేశ్వరప్రసాద్‌దే. వాస్తవంగా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఈయన చాలాకాలంగా డిప్యూటేషన్‌పై ఎయిడ్స్ కంట్రోల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆమధ్య డిప్యుటేషన్ గడువు ముగిసినా పరపతి ఉపయోగించి మళ్లీ పొడిగించుకుని ఇప్పుడు ఏకంగా ఏపీశాక్స్‌కు ఇన్‌ఛార్జి ఏపీడీగా, టీఐ ఎన్జీవో బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చాలా కాలంగా పని చేసిన కామేశ్వరప్రసాద్‌తో అప్పట్లో ఉన్న పరిచయాలు, సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని నాగభూషణరావు తన పాపాలను మాఫీ చేయించుకుంటూ వచ్చారు. ఇప్పుడు తనపై వచ్చిన ఫిర్యాదులను కూడా అదేవిధంగా మాఫీ చేయించుకుని మళ్లీ ఛైల్డ్ ఫండ్ ఇండియా డీఆర్పీగా రావడానికి మంత్రాంగం నడుపుతున్నట్లు తెలిసింది. అందుకు తగినట్లే ఈయన్ను పక్కనపెట్టి నాలుగు నెలలైనా ఇప్పటివరకు ఆ స్థానంలో వేరొకరిని నియమించలేదు.










Comments