సినిమాల్లో విలన్.. పర్యావరణానికి హీరో!
- DV RAMANA

- 2 days ago
- 3 min read
చెట్లలోనే అమ్మను చూసుకుంటున్న నటుడు
ఆమె జ్ఞాపకార్థం నిర్విరామ వన యజ్ఞం
48 ప్రాంతాల్లో లక్షలాది మొక్కలు నాటి వనాల సృష్టి
భారీ మర్రిచెట్లను రీలొకేట్ చేసి పునరుజ్జీవనం
దశాబ్దకాలంగా సాయాజీ షిండే ప్రశంసనీయ కృషి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నది నానుడి. డబ్బున్నవారు తలచుకుంటే ఏదైనా చేయగలరనేది దీని అర్థం. కానీ తలచుకోవడమే ముఖ్యం కదా! అదీ మంచి పనులు చేయాలని తలచుకునేవారు, తపించేవారు చాలా అరుదుగా ఉంటారు.
అటువంటి అరుదైనవారిలో ఒకరైన ప్రపంచస్థాయి పారిశ్రామిక సంస్థ రిలయన్ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ ఏనుగులు, ఇతర జంతుజాలాన్ని సంరక్షించాలని తలచుకుంటే వంతారా పేరుతో పేద్ద అడవే పుట్టుకొచ్చింది.
అంబానీల స్థాయి లేకపోయినా.. సినీరంగానికి చెందిన ఒక వ్యక్తికి అమ్మపై ఉన్న ప్రేమ పర్యావరణానికి వరంగా మారింది. అతన్ని పర్యావరణ ప్రేమికుడిగా మార్చి వనాల సృష్టికర్తగా మార్చింది. అభివృద్ధి పేరుతో ఉనికిని కోల్పోయే ప్రమాదమున్న వృక్షరాజాలకు ఆశ్రయం కల్పించే దాతగా మార్చింది. ఇంతకూ ఆయన ఎవరంటారా? ఆయన మరోవరో కాదు ప్రముఖ సినీనటుడు సాయాజీ షిండే. సినిమాల్లో విలన్ పాత్రల్లో భయపెట్టే ఆయన నిజ జీవితంలో ప్రకృతిని రక్షించే హీరోగా ఏమాత్రం ప్రచారం ఆశించకుండా పనిచేస్తున్నారు. దశాబ్దకాలం నుంచి పర్యావరణ హితుడిగా మారిన ఆయన ఒక ప్రత్యేక సంస్థను స్థాపించి సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజహితుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు.
వాచ్‌మెన్ నుంచి స్టార్ యాక్టర్‌గా..
సాయాజీ షిండే ఎన్నో కష్టానష్టాలను అధిగమించి ప్రముఖ నటుడి స్థాయిగా ఎదిగారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆయన భూమిని 1978లో ఒక డ్యామ్ నిర్మాణం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పునరావాస ప్యాకేజీలో భాగంగా సాయాజీ షిండేకు ఇరిగేషన్ శాఖలో వాచ్‌మెన్ ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం.. కోల్పోయిన భూమికి బదులుగా రావాల్సిన ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. 35 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2022లో ఆ భూమి షిండే కుటుంబం చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ భూమిలో పెద్ద నర్సరీ నిర్వహిస్తున్నారు. కాగా నటనపై మక్కువతో మొదట మరాఠీ రంగస్థలంలో నటించిన షిండే.. అక్కడి నుంచి బాలీవుడ్ ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌ను ఆకర్షించారు. తనదైన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. 2003లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఠాగూర్ ద్వారా ఆయన తెలుగు తెరకు ప్రతినాయకుడి(విలన్)గా పరిచయమయ్యారు. అప్పటికి ఆయనకు తెలుగు రాకపోయినా నేర్చుకుని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. అక్కడినుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ అగ్రనటుడిగా ఎదిగారు. విలన్ పాత్రలతోపాటు కామెడీ విలనిజాన్ని కూడా పండించి మెప్పించారు.
తల్లి జ్ఞాపకార్థం వనయజ్ఞం
తెలుగు సినీరంగంలో రాణిస్తూ వందల కోట్ల ఆస్తులు సంపాదించిన సాయాజీ షిండే జీవితాన్ని 2016లో జరిగిన కొన్ని సంఘటనలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. వందల కోట్ల ఆస్తి ఉన్నా సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వారిని చూసినప్పుడు, కరవుకాటకాలతో అల్లాడుతున్న పల్లెలను చూసి ఆయన మనసు వికలమయ్యేది. సరిగ్గా అదే సమయంలో ఆయన 92 ఏళ్ల వయసున్న తన తల్లిని కోల్పోయారు. ఆ క్షణమే ఆయనలో ఓ సంకల్పం అంకురించింది. తల్లి మరణాన్ని ఆపలేకపోయినా ఆమె జ్ఞాపకాలను శాశ్వతంగా ఉంచాలన్న ధ్యేయంతో ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. అదే వనయజ్ఞం. తన తల్లి బరువుకు సమానంగా విత్తనాలను తూచి.. వాటిని స్వరాష్ట్రమైన మహారాష్ట్ర అంతటా నాటాలని నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పం నుంచి పుట్టిందే ‘సహ్యాద్రి దేవరాయ’ అనే పర్యావరణ ఉద్యమం. అప్పట్లో హైదరాబాద్ నుంచి సుమారు రూ. రెండు లక్షల ఖర్చుతో రెండు ట్రక్కుల నిండా మొక్కలు తెప్పించి ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి అప్రతిహతంగా పురాతన అడవుల పున:సృష్టి అన్న కాన్సెప్ట్ ఆధారంగా మొదలైన ఈ మిషన్ ద్వారా ఇప్పటివరకు ఏకంగా 6.5 లక్షలకు పైగా మొక్కలు నాటి.. వాటి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పునరావాసం కింద ప్రభుత్వం తమ కుటుంబానికి ఇచ్చిన భూమిని కూడా పెద్ద నర్సరీగా మార్చి వేలాది గ్రామాలకు పచ్చదనం పంచేందుకు కృషి చేస్తున్నారు. తన స్వగ్రామంలో రెండువేల మొక్కలతో ప్రారంభమైన ఈ ఉద్యమం ప్రస్తుతం 48 విభిన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లక్షలాది చెట్లలోనే తన తల్లి బతికి ఉందని నమ్ముతూ ఈ పర్యావరణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ యంత్రాంగానికే సవాల్
మొక్కలు నాటడమే కాకుండా పురాతన భారీ వృక్షాలను పరిరక్షించడంలోనూ ప్రశంసనీయ పాత్ర పోషిస్తున్నారు. రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం నరికివేతకు గురికావాల్సిన 200కు పైగా భారీ మర్రిచెట్లను అత్యాధునిక సాంకేతికతతో యథాతథంగా వేరే చోటుకు తరలించి రీ ప్లాంటేషన్ (మళ్లీ నాటడం) చేయించారు. దీన్నే రీలోకేటింగ్ ప్రక్రియ అంటారు. ఇలా షిండే సంస్థ రీలోకేట్ చేసిన చెట్లు పునర్జన పొంది ఇప్పుడు దాదాపు వందల జాతుల పక్షులు, కీటకాలకు ఆశ్రయమిస్తున్నాయి. దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదానికి బదులుగా ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను ఇవ్వాలనే సరికొత్త ప్రతిపాదనను కూడా ఆయన తెరపైకి తెచ్చారు. ఒకప్పుడు ఒక్క చెట్టు కూడా లేక 60 ఏళ్లుగా ఎడారిలా ఉన్న ఓ గ్రామంలో ఊరి జనమంతా కలిసి రూ.17 లక్షలు పోగుచేసేలా స్ఫూర్తి నింపి, అక్కడ 16వేల చెట్లతో పచ్చని అడవిని సృష్టించి కరువును పారదోలిన ఘనత సాయాజీ షిండేకే దక్కింది.






Comments