top of page

‘సుప్రీం’నే మెప్పించిన లాయర్ ‘మమత’

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 3 min read

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిత్యం కేసుల విచారణ, వందలాది కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బందితో నిత్యం రద్దీగా ఉంటుంది. కాకలుతీరిన న్యాయవాదులు నల్లకోటులను సర్దుకుని తమ ప్రతిభను చాటుకునేలా తమ వాదనలు వినిపిస్తుంటారు. వీటిలో కొన్ని అరుదైన, చిత్రమైన కేసులు కూడా ఉంటాయి. తీర్పులు వెలువరించే సందర్భాల్లో భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. కానీ వీటన్నింటికీ భిన్నమైన ఒక చరిత్రాత్మక ఘట్టానికి మొన్న బుధవారం సుప్రీంకోర్టు వేదికైంది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ధర్మాసనం కోర్టు హాలు ఎప్పటిలాగే కిక్కిరిసి ఉంది. చీఫ్ జస్టిస్ విచారణలు ప్రారంభించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. అంతలోనే ‘నాకో ఐదు నిమిషాల టైమ్ ఇవ్వండి మైలార్డ’ అంటూ ఓ మహిళా స్వరం చిన్నగానే అయినా స్పష్టంగా వినిపించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో సహా కోర్టులో ఉన్న అందరి దష్టి ఒక్కసారిగా ఆ స్వరం వినవచ్చినవైపు మళ్లింది. మొదటివరుసలో నిలబడి ఉన్న ఆ మహిళామూర్తిని చూసి ఒక్కక్షణం అవాక్కయ్యారు.. నమ్మలేకపోయారు. ఐదు నిమిషాల సమయం కోరిన ఆ మహిళా మరెవరో కాదు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జీ. మొదట విస్మయానికి గురైనా.. అంతలోనే తేరుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘ఐదు కాదు.. పదిహేన్ నిమిషాలు తీసుకోండి. మీ వాదనలు సంపూర్ణంగా వినిపించండి. వినడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని స్వయం చీఫ్ జస్టిస్ చెప్పడం చూసి అక్కడ ఉన్నవారందరూ ఉద్విగ్నతకు గురయ్యారు. ముఖ్యమంత్రి స్వయంగా కోర్టుకు రావడమే విశేషమైతే.. ఆమె ఏం చెప్పదలచుకున్నారన్న ఆసక్తి కోర్టు హాలు అంతటా కనిపించింది. ముఖ్యమంత్రులు స్వయం కోర్టుకు హాజరుకావడం గతంలో మూడుసార్లు మాత్రమే జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కొన్ని కేసుల్లో కోర్టుకు హాజరై వివరణలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఏపీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్టుల ముందు హాజరైనా వారు అక్రమ ఆస్తుల కేసుల్లో నిందితులుగా హాజరయ్యారు. కానీ మమతా బెనర్జీ తమ రాష్ట్రానికి, ప్రజలకు న్యాయం కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో ఓటర్ల జాబితాల నుంచి లక్షలాది పేర్లు తొలగించడాన్ని తప్పుపడుతూ ఆమె రాజ్యాంగ రక్షణ కోసం, బెంగాల్ ప్రజల ఓటు హక్కు కోసం న్యాయపోరాటం చేయడం న్యాయచరిత్రలోనే అరుదైన సన్నివేశం. ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ ‘నేను ఇక్కడికి నా పార్టీ కోసం రాలేదు, ఒక సామాన్య పౌరురాలిగా న్యాయం కోసం వచ్చాను. సీఎం హోదాలో ఎన్నికల కమిషన్‌కు (ఈసీఐ) ఆరు లేఖలు రాసినా ఒక్క సమాధానం లేదు. అందుకే చిట్టచివరి ఆశగా మీ ముందుకు వచ్చాను” అని ఆమె కోర్టుకు చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎసఐఆర్) పేరుతో బెంగాల్‌లో దాదాపు 1.4 కోట్ల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని దీదీ ఆరోపించారు. చిన్న చిన్న స్పెల్లింగ్ తప్పులు, అక్షరదోషాలను సాకుగా చూపడంతోపాటు వివాహమై అత్తవారింటికి వెళ్లిన మహిళల పేర్లను కూడా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ‘ఎన్నికల ముందు ఇంత తొందర ఎందుకు? కేవలం బెంగాల్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?” అని ఆమె నిలదీశారు. అమర్త్య సేన్ వంటి ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమె వాదనలపై సీజేఐ సానుకూలంగా స్పందించారు. ఎన్నికల కమిషన్ బాధ్యతల నుంచి తప్పించుకోలేదు’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఏ ఒక్క అసలైన ఓటరు (జెన్యూన్ సిటిజన్) పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థానిక భాషా దోషాల కారణంతో ఓటు హక్కు కోల్పోవడం అన్యాయమని, దీనికి ఈసీఐ కచ్చితంగా పరిష్కారం చూపాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రాథమిక విచారణ ముగియగా.. ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం తమ వివరణలను కోర్టుకు ఈ నెల తొమ్మిదిలోగా సమర్పించాల్సి ఉంది. ఒక్క బెంగాల్‌లో మాత్రమే అత్యంత భారీ స్థాయిలో ఎనిమిదివేల మంది మైక్రో అబ్జర్వర్లను ఎందుకు నియమించారో ఈసీఐ సమాధానం చెప్పాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై స్టే ఇవ్వాలన్న మమతా బెనర్జీ డిమాండకలపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. వ్యవస్థలు స్పందించనప్పుడు వీధికెక్కి పోరాడటమే కాకుండా.. న్యాయస్థానం గడప తొక్కి స్వయంగా వాదించిన దీదీ తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు ముఖ్యమంత్రి పట్టుదల, ఇటు అత్యున్నత న్యాయస్థానం భరోసా.. వెరసి ఫిబ్రవరి 9 నాటి తీర్పు బెంగాల్ ఓటర్ల భవితవ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను నిర్ణయించడంలో ఒక మైలురాయిగా నిలవనుంది. సిట్టింగ్ ముఖ్యమంత్రి స్వయంగా కోర్టు గదిలో నిలబడి లాయర్ల ద్వారా పిటిషన్ వేయడం, అప్పటికప్పుడు బెంచ్ అనుమతి తీసుకుని తన వాదనలు తనే వినిపించడం భారతీయ న్యాయ చరిత్రలో అత్యంత అరుదైన, అపూర్వమైన ఘటన. సాధారణంగా ముఖ్యమంత్రులు తమ తరపున లేదా తమ ప్రభుత్వం తరఫున వాదించడానికి లక్షల్లో ఫీజులు ముట్టజెప్పి అగ్రశ్రేణి న్యాయవాదులను (సీనియర్ అడ్వకేట్స్) నియమించుకుంటారు. కానీ మమతా బెనర్జీ మాదిరిగా బాధితురాలిగా, ఒక రాష్ట్ర పౌరురాలిగా తమ రాష్ట్ర సమస్య కోసం కోర్టు మెట్లు ఎక్కి వాదించిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. దీనికోసం ఆమె ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కోర్టు హాలులోనే గడపడం విశేషం. ప్రత్యేక ఓటర్ల రివిజన్ పేరుతో లక్షల్లో ఓటర్లను తొలగిస్తున్న తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తన ప్రత్యేక శైలితో మమతా దీదీ ఈ సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానంతోపాటు యావత్తు దేశప్రజల దష్టికి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. దీనిపై స్పందించడం ఎన్నికల కమిసన్ వంతు.



Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page