top of page

సంప్రదాయాల క్రాంతి.. షాపింగ్‌ సంక్రాంతి!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jan 14
  • 1 min read
  • పండుగ శోభతో సందడిగా జిల్లా

  • వైభవంగా భోగి పండుగ.. గోదా కల్యాణాలు

  • రద్దీగా కనిపిస్తున్న షాపులు, మార్కెట్లు

  • పంట దిగుబడులు బాగుండటంతో పెరిగిన కొనుగోళ్లు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మంచు తెరలు వీడకముందే.. చీకటి తెరలను చీల్చుకుంటూ ధగధగమంటూ ప్రజ్వరిల్లిన భోగిమంటల వెలుగుల్లో సంక్రాంతి లక్ష్మి జిల్లాను పలకరించింది. పెద్ద పండగగా వ్యవహరించే నాలుగు రోజుల సంక్రాంతి పండుగకు భోగి పండుగతోనే అంకురార్పణ చేయడం సంప్రదాయం. ఆ భోగిమంటలే సంక్రాంతి శోభను తీసుకొచ్చాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఘనంగా నిర్వహించే ఈ పండుగ కోసం ఎక్కడెక్కడో ఉన్న జిల్లా వాసులందరూ స్వస్థలాలకు తరలివచ్చేశారు. భోగి పండుగ సందర్భంగా వీధుల్లో పెద్దపెద్ద మంటలు వేసి చలిని తరిమేసేందుకు యత్నించారు. ఇక ఆలయాల్లో గోదా రంగనాథుల కల్యాణాల హడావుడి కనిపించగా, మరోవైపు పండుగ బజారు చేయడం, షాపింగ్‌లతో పెద్దవారు బిజీ అయిపోగా.. కొత్త బట్టలు ధరించిన పిల్లలు ఆటపాటలతో సందడి చేశారు. ఇక సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు వేసేందుకు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రెండురోజుల కిందటే జిల్లాలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. నిత్యావసర వస్తువులు, నూతన వస్త్రాలు, కూరగాయలు, పండ్లు, పూజాసామగ్రి వ్యాపారాలు.. ముఖ్యంగా రోడ్డుసైడు వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పంటల దిగుబడి బాగుండటం, ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి చెందిన డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తుండటం వల్ల పండుగ ఖర్చులకు గ్రామీణులు వెనుకాడటంలేదు. దీనికితోడు ఉద్యోగులకు ఒక డీఏ బకాయిలను, కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడంతో సంక్రాంతికి కాసుల కళ అదనపు శోభ తీసుకొచ్చింది. కొనుగోళ్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. బ్రాండెడ్‌ వస్త్రాలు విక్రయించే కార్పొరేట్‌ షాపింగ్‌ మాల్స్‌ కిటకిటలాడాయి. కాగా సంప్రదాయ వస్త్ర దుకాణాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు కొనుగోళ్లు జరుపుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జిల్లాలో వస్త్ర వ్యాపారం పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. బ్రాండెడ్‌ షాపుల వల్ల సంప్రదాయ వ్యాపారానికి కొంత ఇబ్బంది కలిగినా.. దాన్ని అధిగమించేలా వ్యాపారులు కొన్ని మార్పులు చేసుకోవడంతో సంక్రాంతి వ్యాపారానికి ఢోకా లేదు. వివిధ ప్రాంతాల నుంచి కేవలం సంక్రాంతికి మాత్రమే వచ్చి ఫుట్‌పాత్‌పై రడీమేడ్‌ వ్యాపారం చేసే వారికి ఈ సంవత్సరం కలిసొచ్చిందని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారంతా ఫుట్‌పాత్‌ వ్యాపారులను ఆశ్రయించారు. షాపింగ్‌ మాల్స్‌లో అన్ని వర్గాల వారికి అవసరమైన వస్త్రాలు అందుబాటు ధరల్లో ఉండడం వల్ల మహిళలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page