సంపన్నులదీ వలసబాటే!
- DV RAMANA
- 6d
- 2 min read

మేధోవలస మన దేశానికి కొత్త కాదు. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. బ్రెయిన్ డ్రెయిన్ అని పిలిచే మేథోవలస అంటే మన మేధావులు, విద్యావంతులు, నిపుణులు విదేశాలకు తరలిపోవడమన్న మాట. దీనివల్ల ఆయా దేశాలకు మేలు జరుగుతుంటే.. పరిశోధన, విద్య, పారిశ్రామిక రంగాల్లో మనం వెనుకబడిపోతున్నాం. మేథోవలసలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ నిష్ఫ లమవుతున్నాయి. యువత ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ప్రతి ఏటా విదేశాలకు వెళుతూనే ఉన్నారు. అక్కడే ఉద్యోగాలు సంపాదించి స్థిరపడిపోతున్నారు. ఇది చాలదన్నట్లు మేథోవలసలకు సంపన్నుల వలస కూడా తోడవుతున్నట్లుంది. సంపన్నవర్గాలవారు కూడా భారత్‌ను వీడి విదేశాలకు తరలిపోతున్నారు. దేశంలోని వనరులను వినియోగించుకుని డబ్బు సంపాదించుకున్న తర్వాత విదేశాలకు వెళ్లి స్థిరపడిపోతున్నారు. దీనికి తాజా ఉదాహరణ ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మల జంటే. క్రికెట్ ద్వారా విరాట్, సినిమాల ద్వారా అనుష్క వందల కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆ సొమ్ముతో వారు లండన్‌కు వెళ్లి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాగా 2024లో 2.06 లక్షలకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దేశం విడిచి వెళుతున్న వారిలో ఎక్కువ మంది అధిక నికర విలువ కలిగిన అంటే.. ఎక్కువ ఆస్తులు కలిగినవారే. ఈ షాకింగ్ విషయాలను హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక వెల్లడిరచింది. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది సుమారు 3,500 మంది మిలియనీర్లు భారత్ నుంచి వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నారు. వారి మొత్తం సంపద విలువ 26.2 బిలియన్ డాలర్లు. 2023లో కూడా 4,300 మంది మిలియనీర్లు దేశం విడిచి వెళ్లారు. 2011 నుంచి 17.5 లక్షల మంది భారతీయులు తమ పాస్ పోర్ట్‌లను వదులుకున్నారని ఈ నివేదిక తెలిపింది. సంపన్నులు భారతదేశాన్ని ఎందుకు వదిలి వెళ్తున్నారు? ఆ ప్రభావం దేశంపై ఏ స్థాయిలో ఉంటుంది? అనే ప్రశ్నలు తలెత్తుక మానవు. మెరుగైన జీవితం, మంచి ఆరోగ్య సేవలు, పని, వ్యాపార అవకాశాలు, తక్కువ పన్నులు, భద్రత వంటి కార ణాలే ధనవంతులను విదేశాల వైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయని ఈ నివేదిక విశ్లేషించింది. మన దేశంలో పన్నులు చెల్లించినా వాటి ప్రతిఫలం సాధారణ ప్రజలకే కాకుండా సంపన్నులకు కూడా అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఐర్లాండ్‌కు వలస వెళ్లిన ఒక మహిళ మాట్లాడుతూ తాము సంవత్సరానికి రూ.50 లక్షలకుపైగా ఆదాయపు పన్ను చెల్లించామని, దానికి ప్రతిగా అందాల్సిన భద్రత, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలు లభించలేదని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశా లతో పోలిస్తే ఈ విషయంలో మనదేశం చాలా వెనుకబడి ఉందన్నారు. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత పాస్‌పోర్టుకు 76వ స్థానం లభించింది. దీనివల్ల 58 దేశాలకు మాత్రమే వీసా రహిత ప్రవేశం ఉంటుంది. అదే యూఎస్ (193 దేశాలు), సింగపూర్ (192), కెనడా (186) పాస్‌పోర్ట్‌లు మరింత బలమైన యాక్సెస్ కల్పిస్త్తాయి. దాంతో మెజారిటీ సంపన్నులు పాస్‌పోర్ట్‌నే ప్రాధాన్యాంశం గా చూస్తున్నారని నివేదిక పేర్కొంది. 2018 నుంచి 2023 మధ్య 3.2 లక్షల భారతీయులు అమె రికాలో, 1.6 లక్షల మంది కెనడాలో, 1.3 లక్షల మంది ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. దుబాయ్, సింగపూర్, పోర్చుగల్, మాల్టా వంటి దేశాలు కూడా తక్కువ పన్నుల వ్యవస్థ, నివాసితులకు సులభ మైన హక్కులు, పెట్టుబడి ద్వారా పౌరసత్వం వంటి అవకాశాలను అందిస్తున్నాయి. దీంతో భార తీయ సంపన్నులు ఈ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే విదేశీ విశ్వవిద్యాలయాల్లో విస్తృత పరిశోధనావకాశాలు, స్థిరమైన ఆర్థిక వాతావరణం వలసలకు ప్రధాన ఆకర్షణలుగా మారాయి. సంపన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వడానికి విదేశీ పౌరసత్వాన్ని మార్గంగా ఎంచుకుంటున్నారని నివేదిక తేల్చి చెప్పింది. యూఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను ఉండదు, కార్పొరేట్ పన్ను కూడా తొమ్మిది శాతం మాత్రమే. కానీ మన దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను అధికంగా, కార్పొరేట్ పన్నులు తక్కువగా ఉంటాయి. దీనిపై ఒక పారిశ్రామికవేత్త మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కువ పన్నులు చెల్లించాలి.. మరో చేత్తో ఆరోగ్యం, విద్య, భద్రత వంటి అవసరా లకు అదనంగా ఖర్చు చేయాలి. ఇదే మధ్యతరగతి, సంపన్ను వర్గాలను దేశం విడిచివెళ్లేలా చేస్తోం దన్నారు. ఏమైనా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధికి శక్తి కేంద్రాలైన సంపన్నుల వలసలు భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments