top of page

సూపరింటెండెంట్‌కు గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంల సెగ

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 7
  • 2 min read
  • ఛాంబర్‌లో బైఠాయించి ఆందోళన

  • రీ-కౌన్సిలింగ్‌ నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్‌

  • వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో గందరగోళం

    ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

వైద్యఆరోగ్యశాఖ సూపరింటెండెంట్‌కు గ్రేడ్‌`3 ఏఎన్‌ఎంల సెగ తగిలింది. సచివాలయం గ్రేడ్‌`3 ఏఎన్‌ఎంల బదిలీల్లో అవినీతి, అక్రమాలపై బాధిత ఏఎన్‌ఎంలు సోమవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలోని సూపరింటెండెంట్‌ ఛాంబర్‌లో ఆందోళనకు దిగారు. రీ`కౌన్సిలింగ్‌ నిర్వహించి న్యాయం చేయాలని ఏఎన్‌ఎంలు నిరసన చేపట్టారు. బదిలీల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏకపక్ష వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధిత ఏఎన్‌ఎంలు బైఠాయించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అనిత వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లిపోవడంతో కార్యాలయంలో సూపరింటెండెంట్‌ భాస్కర్‌ కుమార్‌ను, ఏవో బాబురావును నిలదీశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఖాళీలను బ్లాక్‌ చేసి వాటిని చూపించకుండా జూమ్‌ ద్వారా కౌన్సిలింగ్‌ నిర్వహించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే జిల్లాలో మాత్రం జూమ్‌ ద్వారా కౌన్సెలింగ్‌ చేయడం ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. గడువులోగా కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గడువు చివరి రోజు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించి హడావుడిగా జాబితాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులు నివేదించారని, వాటినే అధికారులు ఓకే చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీఎన్జీవోలు, జిల్లా జేఏసీ నాయకులతో కలిసి బాధిత ఏఎన్‌ఎంలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. బదిలీల కౌన్సెలింగ్‌లో అక్రమాలకు పాల్పడిన విషయంపై అనేక ఫిర్యాదులు వచ్చినా, వాటిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారించలేదని విమర్శించారు. గతంలో ఎన్నడూ ఈ మాదిరిగా కౌన్సెలింగ్‌ జరగలేదని బాధిత ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులు బదిలీల్లో రోస్టర్‌ పాటించకపోవడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్‌`6కు విరుద్ధంగా బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించినట్టు కలెక్టర్‌కు ఏపీఎన్జీవో నాయకులు సాయిరాం వివరించిన తర్వాత కొంత సందిగ్ధం నెలకున్నా రీకౌన్సెలింగ్‌ నిర్వహించడానికి ఉన్నతాధికారులు సుముఖత చూపలేదు. వాస్తవంగా జిల్లాలో సచివాలయ బదిలీల్లో గ్రామ సర్వేయర్ల కౌన్సిలింగ్‌ నిర్వహించినా ఆర్డర్లు ఇవ్వలేదు. గత నెల 30 నాటికి బదిలీలు చేయాల్సి ఉండగా, ఈ నెల 1న కౌన్సెలింగ్‌ ప్రారంభించి అర్థాంతరంగా నిలిపేశారు. వీరికి ప్రభుత్వం 5వ తేదీలోగా బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచించింది. దీంతో ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వీరికి పోస్టింగ్‌ ఆర్డర్లు మాత్రం ఇవ్వలేదు. వీటిపై ఈ నెల 5వ తేదీ వేసి ఆర్డర్లు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. వీరి మాదిరిగానే సచివాలయ ఏఎన్‌ఎంల విషయంలో జీవో 6 ప్రాప్తికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని 70 శాతం మంది గ్రేడ్‌`3 ఏఎన్‌ఎంలు డిమాండ్‌ చేస్తున్నారు. రూరల్‌ నుంచి అర్బన్‌కు అడ్డదారిలో వచ్చిన ఏఎన్‌ఎంలు మినహా మిగతావారంతా అసంతృప్తితో ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సులను అధికారులు పక్కన పెట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని బాధిత ఏఎన్‌ఎంలు జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. సచివాలయం ఉద్యోగుల బదిలీల్లో అన్నీ సవ్యంగా సాగినా, వైద్యఆరోగ్యశాఖ పరిధిలో సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్‌`3 ఏఎన్‌ఎంలు విషయంలో శాఖ అధికారులు తీవ్ర అన్యాయం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చే విధంగా గ్రేడ్‌`3 ఏఎన్‌ఎంలు లేవనెత్తిన కౌన్సెలింగ్‌ లోపాలపై వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఎవరూ సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వాకంపై అన్నివైపుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page