top of page

సిఫార్సుల పురస్కారాలకు చెక్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Aug 12
  • 2 min read
  • స్వాతంత్య్ర దినోత్సవానికి భారీగా లిస్టులు

  • చాంతాడు జాబితాలను తెగ్గొట్టే పనిలో జేసీ

  • వాటిలో ఉన్న ఉద్యోగులను పిలిపించి ప్రశ్నల వర్షం

  • అచ్చమైన అర్హులనే ఎంపిక చేసి గౌరవించాలని యత్నం

ree

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

పంద్రాగస్టు వస్తోంది. ఆరోజు జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయడం కంటే ఆ సందర్భంగా ఇచ్చే ఉత్తమ సేవల పురస్కారాలపైనే ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మొగ్గు చూపిస్తున్నారు. మంచి సర్వీసులు అందించకపోయినా ఏదోవిధంగా ఆయా శాఖల నుంచి జిల్లా అధికారులకు పంపే అర్హుల జాబితాల్లో తమ పేర్లు చేర్పించేశారు. కానీ ప్రతి యేడు మాదిరిగా ఈ జాబితాలకు యథాలాపంగా టిక్‌ పెట్టేయకుండా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ పలురకాలు వడపోత కార్యక్రమం చేపడుతుండటంతో ఎప్పటిలా చాంతాడు జాబితాలు పంపిన పలు శాఖల అధికారులు బిక్కమొహం వేస్తున్నారు. రిపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపించే అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇచ్చి గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రతిభ, సేవలతో సంబంధం సిఫార్సులతోనే ఉత్తుముల జాబితాలు చాంతాడులా ఏటేటా పెరిగిపోతున్నాయి. ఆయా శాఖల నుంచి అందే జాబితాలను యథాతథంగా ఆమోదించడం వల్ల ప్రశంసాపత్రాలు అందుకునేవారి సంఖ్య 700కు పెరిగిపోయింది. ఇప్పుడు ఈ దుస్సంప్రదాయానికి ఉన్నతాధికారులు చెక్‌ పెట్టే పనిలో పడ్డారు. ఆ మేరకు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవంనాడు ఉత్తమ సత్కారాల కోసం శాఖలవారీగా అందిన జాబితాలను జల్లెడ పట్టడం ప్రారంభించారు.

సూచనలు పట్టించుకోకుండా..

అనవసరంగా ఎక్కువమందిని రివార్డుల జాబితాలో చేర్చి సిఫార్సు చేయవద్దని ఉన్నతాధికారులు మొత్తుకున్నా కొన్ని శాఖల అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నవారినే ఉత్తమ అధికారులు, ఉద్యోగులుగా ఎంపిక చేయడానికి వీలుగా జాబితాలు సిద్ధం చేయగా.. విమర్శలకు తావులేకుండా అర్హత కలిగిన అధికారులు, ఉద్యోగులను ఎంపిక చేయడానికి జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ శ్రీకారం చుట్టారు. శాఖాధిపతులు పంపిన జాబితాలో ఉన్న అధికారులు, ఉద్యోగులను జేసీ తన ఛాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. యోగా డే, స్వచ్ఛ భారత్‌, పింఛన్ల పంపిణీ, పీ`4 బంగారు కుటుంబాలు ఎంపిక, పీజీఆర్‌ఎస్‌ సమస్యల పరిష్కారంలో చూపించిన చొరవ తదితర కార్యక్రమాల్లో వారి పోషించిన పాత్ర, చేసిన కృషి ఏమిటన్న కోణంలో జేసీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏ కేడర్‌లో ఎప్పుడు విధుల్లో చేరారు, ఇంతకుముందు ఎప్పుడైనా ప్రశంసాపత్రం అందుకున్నారా.. అని ప్రశ్నిస్తూ వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. మరికొందరినైతే మీ పేరునే ఎందుకు సిఫార్సు చేశారని ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. ఈ ఏడాది పంద్రాగస్టుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల నుంచి 250కి మించకుండా ప్రశంసాపత్రాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలో మాదిరిగా ఎవరి సిఫార్సులను పరిగణలోకి తీసుకోకుండా విధుల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ శాఖల నుంచి అందే జాబితాలను కుదించే పనిలో జేసీ నిమగ్నమయ్యారని తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page