సిఫార్సులు పట్టలేదు.. రూల్సూ పాటించలేదు!
- NVS PRASAD

- Jul 5, 2025
- 3 min read
రచ్చరచ్చ అయిన ఏఎన్‌ఎంల బదిలీ కౌన్సెలింగ్
మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్.. అందరూ అసంతృప్తి
చాలా సచివాలయాల పరిధిలో ఇద్దరికి పోస్టింగ్
అదే సమయంలో ట్రైబల్ ఏరియాల్లో భర్తీ కాని పోస్టులు
రీ కౌన్సెలింగ్‌కు డిమాండ్ చేస్తున్న బాధితులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సచివాలయాల్లో పని చేస్తున్న గ్రేడ్-3 ఏఎన్‌ఎంల బదిలీలను ఓపిగ్గా , పారదర్శకంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు.. అంటూ డీఎంహెచ్‌వో అనితను సచివాలయ ఏఎన్‌ఎం ఉద్యోగుల సంఘం పేరుతో ఓ పుంజెడు మంది సన్మానిస్తున్న ఫొటో ఇది. వీరంతా రూరల్ నుంచి అర్బన్‌కు వచ్చిన బ్యాచ్.

కౌన్సెలింగ్‌లో అర్బన్ టు అర్బన్ పోస్టింగ్ ఇవ్వకుండా రూరల్‌లో ఉన్నవారిని తీసుకొచ్చి నగరంలో పోస్టింగ్ ఇచ్చారని, దీనివల్ల జీవోఎంఎస్ నెం.6ను తుంగలో తొక్కినట్లయిందని జిల్లా ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు, ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం స్వయంగా బాధిత ఏఎన్‌ఎంలను తీసుకెళ్లి కలెక్టర్ దినకర్ పుండ్కర్‌కు ఫిర్యాదు చేస్తున్న ఫొటో ఇది.

కొందరేమో ఓపిగ్గా 605 మందిని బదిలీ చేసినందుకు శాలువ కప్పితే.. మరికొందరేమో తమకు అన్యాయం జరిగిందని, రీ కౌన్సిలింగ్ చేయాలంటూ కలెక్టర్‌ను కలవడాన్ని ఎలా చూడాలి? ఈ పరిణామాలను పాఠకులు, పత్రికలు ఏ కోణంలో విశ్లేషిస్తున్నాయన్న విషయాన్ని పక్కన పెడితే నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు అసలు ఈ వివాదాన్ని ఏ కోణంలో చూస్తున్నారనేది ప్రధానం.
మంత్రి, ఎమ్మెల్యేల అసంతృప్తి
రెండు రోజుల పాటు జరిగిన ఈ కౌన్సెలింగ్‌కు సంబంధించి జిల్లాలో దాదాపు అందరు ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఆ మేరకు కొన్ని స్థానాలు బ్లాకులో పెట్టాలని దాని ఉద్దేశం. కానీ డీఎంహెచ్‌వో కార్యాలయ కౌన్సెలింగ్ బోర్డు మాత్రం రాజకీయ నాయకుల పేరు చెప్పి ఇష్టారీతిన బదిలీలు చేసుకుపోయారు. తీరా కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సుల మేరకు బదిలీలు జరిగాయా? అని చూస్తే.. ఒక్కటి కూడా కనిపించలేదు. అలాగని బదిలీల ప్రక్రియపై ఫిర్యాదులు లేకుండా ఉన్నాయా? అంటే అదీ లేదు. దీంతో ఎమ్మెల్యేలకు చిర్రెత్తిపోయింది. పెంట పెంటగా జరిగిన కౌన్సెలింగ్ తీరిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే నేరుగా డీఎంహెచ్‌వోకు ఫోన్ చేసి చెడామడా ఇచ్చేశారట. రీకౌన్సెలింగ్ చేయమని జిల్లా కలెక్టర్‌ను ఉద్యోగులు కోరారంటే ఏమేరకు అవకతవకలు జరిగాయో అర్థమవుతుందని, ఎంతమంది ఎమ్మెల్యేల సిఫార్సులు చెల్లాయో తెలుసని, జిల్లా కేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న తన సిఫార్సులకే దిక్కు లేనప్పుడు మిగిలిన ఎమ్మెల్యేల మాట చెల్లుబాటైందంటే తాను నమ్మనని గొండు శంకర్ అన్నారట. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది తామని, ఇలా పెంట చేస్తే నష్టపోయేది కూడా తామేనని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అంటే కౌన్సెలింగ్ ప్రక్రియ సరిగ్గా జరగలేదని స్వయంగా స్థానిక ఎమ్మెల్యేనే ఒక అంచనాకు వచ్చినట్టు అర్థమవుతుంది. ఇక రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన స్వగ్రామమైన నిమ్మాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గత ప్రభుత్వం జనావాసాలకు దూరంగా నిర్మించేసిందని, అక్కడకు పేషెంట్లు వెళ్లలేకపోతున్నందున దాన్ని నిమ్మాడ గ్రామంలోకి షిప్ట్ చేయడానికి సంబంధిత ఫైల్ పట్టుకొని తన క్యాంపు కార్యాలయానికి డీఎంహెచ్‌వో అనితను శుక్రవారం పిలిపించుకున్నారు. ఈ సందర్భంగానే కౌన్సెలింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ డీఎంహెచ్‌వో కార్యాలయంలో సూపరింటెండెంట్ భాస్కర్‌కుమార్, ఏవో బాబూరావులను మార్చమని తానెప్పుడో చెప్పానని, ఇప్పుడు ఈ పెంటంతా తమ నెత్తిమీద పెట్టొద్దంటూ అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
రీ కౌన్సెలింగ్‌పై కలెక్టర్ డోలాయమానం
సీన్ కట్ చేస్తే.. జేఏసీ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఆరోపణలపై కలెక్టర్ దినకర్ దృష్టి సారించారు. వెంటనే అన్ని వివరాలు తీసుకుని తనవద్దకు రావాలంటూ డీఎంహెచ్‌వో అనితను ఆదేశించారు. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు కార్యక్రమాలతో బిజీగా ఉన్న కలెక్టర్ ఆ తర్వాత డీఎంహెచ్‌వో చూపిన వివరాలు పరిశీలించి జీవోఎంఎస్ నెం.6ను ఫాలో కాలేదని అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పుడు రీ కౌన్సెలింగ్ నిర్వహించడం కుదురుతుందా లేదా? అన్న దానిపై ఆయన ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. బదిలీల్లో కొన్ని నియోజకవర్గాలకు అన్యాయం జరిగిందని స్వయంగా కలెక్టరే పేర్కొనడం విశేషం. ఎందుకంటే.. ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం వల్ల పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని సచివాలయాల్లో గతంలో పని చేసిన ఏఎన్‌ఎం`3ల కంటే ఇప్పుడు 21 మంది తగ్గిపోయారు.
కొత్త జిల్లా ప్రాతిపదికతోనే చేటు
వాస్తవానికి అన్ని సచివాలయాల్లోనూ ఏఎన్‌ఎంలు ఉండాలి. కానీ అందరూ అర్బన్‌కు, ఫోకల్ ఏరియాలకు బదిలీలు చేయించుకోవడం వల్ల పాతపట్నం లాంటి ట్రైబల్ ఏరియాలో 21 ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీ అయిపోయాయి. దీన్ని గమనించిన కలెక్టర్ ముందు ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలు, నియోజకవర్గాల పరిధిలోని సచివాలయాలన్నింటిలో ఏఎన్‌ఎంలు ఉండేలా పోస్టింగ్‌లు ఇవ్వాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా 38 మండలాల పరిధిలోని 930 సచివాలయ ఏఎన్‌ఎం పోస్టులను ఖాళీగా ప్రకటించి, బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాలి. కానీ కౌన్సెలింగ్ బోర్డు మాత్రం 605 మందే ఏఎన్‌ఎంలు ఉన్నారని చెప్పి.. వాటికే బదిలీల తతంగం నడిపించారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఏఎన్‌ఎంలు లేకుండాపోయారు. జిల్లాల విభజన తర్వాత విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలిసిన నియోజకవర్గాలు, మండలాలతో తమకు సంబంధం లేదని కౌన్సెలింగ్ బోర్డు తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అదే నిజమైతే రాజాం నియోజకవర్గ పరిధిలోని ఏఎన్‌ఎంలు ఇక్కడ కౌన్సెలింగ్‌కు ఎందుకు వచ్చినట్టు? ఎమ్మెల్యేల సిఫార్సులను గౌరవించినా ఒక విధంగా ఉండేది. అలా కాకుండా హేతుబద్ధంగా నిర్వహిస్తే నిఖార్సుగా ఉండేది. ఈ రెండూ చేయలేదు. ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటే ఒక సంఖ్య తేలేది. అలా కాకుండా రెండు నియోజకవర్గాలను వదిలేసి మరో పక్క జిల్లా నియోజకవర్గాన్ని తీసుకోవడం వల్ల మరో అంకె వచ్చింది. మొత్తానికి ఏ నియోజకవర్గాల్లో ఏ సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయో ప్రకటించకుండానే పొలోమని జూమ్‌లోకి వచ్చేయడం వల్ల ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో కూడా చెప్పలేకపోతున్నారు. కొన్ని సచివాలయాలకు ఇద్దరు చొప్పున బదిలీ కావడం దీనికి నిదర్శనం. అంటే ఒక స్థానాన్ని ఒకరు కోరుకున్న వెంటనే దాన్ని వేకెన్సీ జాబితా నుంచి తీసేయకపోవడం వల్ల మళ్లీ మళ్లీ భర్తీ చేసేశారు.
కోర్టుకు వెళ్లే యోచనలో బాధితులు
తాజాగా శనివారం ఈ కథలో మరికొన్ని మలుపులు వచ్చాయి. కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయని బయటపెట్టిన ఒక ఏఎన్‌ఎంను పిలిచి ఆమె కోరుకున్న చోటకు పోస్టింగ్ ఇస్తామని డీఎంహెచ్‌వో బేరం పెట్టినట్టు తెలిసింది. ఇది తన ఒక్కరి సమస్య కాదని, తనలాగే నష్టపోయినవారందరిదీ అని పేర్కొనగానే, ఆమెతో పాటు మరో నలుగురిని కోరుకున్న చోటకు పంపిస్తామని, ఈ వ్యవహారాలకు ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలని రాయబారాలు నడుపుతున్నారట. కానీ గురువారం జేఏసీ నేత సాయిరాంతో వెళ్లిన బాధితులే మళ్లీ శనివారం కూడా కలెక్టర్‌ను కలవడానికి వెళ్లారు. రీకౌన్సెలింగ్ జరపకపోతే కోర్టుకు వెళ్లడానికి వీరు సిద్ధపడుతున్నట్టు భోగట్టా. అటు ఎమ్మెల్యేల సిఫార్సులూ చెల్లక, ఇటు రోస్టర్‌లో ముందున్న వారికి కోరుకున్న స్థానాలు ఇవ్వక, అర్బన్ నుంచి అర్బన్‌కు బదిలీ చేయాలన్న నిబంధన పాటించక 605 మందిని బదిలీ చేశారంటే.. ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారి ఉండాలి? డబ్బులు తప్ప మరొకటి అవసరంలేని అధికారి అండదండలు ఉండి ఉండాలి.










Comments