సాయిరాం డబుల్ హ్యాట్రిక్
- Prasad Satyam
- Dec 30, 2025
- 2 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్ర ఎన్జీవో సంఘమంటేనే ఒక చరిత్ర. ఇందులో నాయకులుగా పని చేసినవారు రాజకీయ నాయకులుగా ఎదిగిన సందర్భాలున్నాయి. రాజకీయ పార్టీలను, అధికార ప్రభుత్వాలను గడగడలాడిరచిన ఘటనలూ ఉన్నాయి. న్యూట్రాలిటీయే తమ నినాదమంటూ మనుగడ సాగిస్తున్న ఎన్జీవో సంఘం, ఆ తర్వాత గజిటెడ్ సంఘంతో కలిసినా తన ప్రాభవాన్ని కోల్పోలేదు సరికదా.. ప్రత్యామ్నాయంగా వచ్చిన ఎన్నో సంఘాలకు ధీటుగా ఎదురొడ్డి నిలబడిరది. అటువంటి జిల్లా ఎన్జీజీవో సంఘానికి అధ్యక్షుడిగా ఆరుసార్లు ఏకగ్రీవంగా లేదా పోటా ద్వారా ఎన్నికడం ఒక రికార్డు. బహుశా ఇది హనుమంతు సాయిరాం పేరు మీదే నమోదయివుందేమో! చౌదరి పురుషోత్తంనాయుడు అప్రతిహతంగా ఎన్జీవో సంఘానికి నాయకత్వం వహించినా, తక్కువ కాలంలోనే ఆయన రాష్ట్రస్థాయి దిక్సూచి కావడంతో బహుశా జిల్లా రికార్డు సాయిరాందే అయివుంటుంది. ఒక నాయకుడి మీద జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత నమ్మకం లేకపోతే ఇటువంటి అరుదైన అవకాశాన్ని ఆరు పర్యాయాలుగా అప్పగిస్తున్నారు. ఆ నాయకుడికి ఎంత ఖలేజా లేకపోతే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటూవస్తున్నాడు. వాస్తవానికి ఎన్జీజీవో సంఘానికో, లేదూ అంటే ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీకో నాయకత్వం వహించడం కంటే సాయిరాం స్టేచర్ పెద్దది. ఉద్యోగరీత్యా ఆయన ఆఫీసర్ కాకపోవచ్చు గానీ, చరిష్మాతో కొలిస్తే.. ఈ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఫేమస్సో.. సాయిరాం కూడా అంతే. పెద్దాసుపత్రిలో పని చేసిన రోజుల్లో సాయీ అంటే.. ఓయ్ పలికి జిల్లా వ్యాప్తంగా అనేకమందికి తలలో నాలుకయ్యారు. పెద్దాసుపత్రికెళ్తే పట్టించుకోరనే ముద్రను మొదటిగా చెరిపింది సాయిరాం అక్కడ పని చేసిన రోజుల్లోనే. ఫలితంగా ముద్దాడ చిన్నబాబు, డాక్టర్ జి.జగన్నాధం వంటి అనేక కాకలుతిరిగిన వైద్యులు మెడికల్ సూపరింటెండెంట్లుగా పని చేసినప్పుడు ఇప్పుడున్నన్ని సదుపాయాలు లేకపోయినా పేషెంట్లలో సంతృప్తి శాతాన్ని పెంచగలిగారంటే అందుకు కారణం సాయిరాం సేవలే. 2002 నుంచి 2004 వరకు శ్రీకాకుళం టౌన్ ఎన్జీవో అధ్యక్షుడిగా పని చేసిన సాయిరాం, 2005 నుంచి 2010 వరకు రెండు పర్యాయాలు జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. 2011 నుంచి ఇప్పటి వరకు ఆయన అప్రతిహతంగా జిల్లా అధ్యక్షుడిగా గెలుస్తున్నారు. 2028 వరకు ఉండే మరో పదవీ కాలానికి మంగళవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సరిగ్గా ఆయన జిల్లా అధ్యక్షుడిగా డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది. 2028 తర్వాత కూడా బహుశా సాయిరామే అధ్యక్షుడు కావాలనే అవకాశం ఉన్నా, అప్పటికి పదవీ విరమణ అవుతుంది కాబట్టి ఆ అవకాశం ఉండకపోవచ్చు. జిల్లా ప్రోటోకాల్‌లో ఉద్యోగుల సంఘ నాయకుడిగా ప్రాముఖ్యత ఉన్న ఈ పోస్టుకు పోటీ లేక కాదు.. కేవలం అర్హతే ప్రాధాన్యంగా సాయిరాంను ఎన్నుకుంటున్నారు. జిల్లాలో ప్రతీ ప్రభుత్వ శాఖకు ఒక యూనియన్ ఉంటుంది. ఇది ఏదో ఒక నాయకుడికి, లేదా ఏదో ఒక పార్టీకి పరోక్షంగా అఫిలియేట్ అయివుంటుంది. కానీ వీరందరూ కలిస్తే సాయిరాం మాత్రమే జిల్లా అధ్యక్షుడు అవుతున్నారు. అంటే.. నిజంగా అది అద్భుతమే. అద్భుతాలంటూ ప్రత్యేకంగా కనపడవు. తెల్లకాగితం మీద మనమే రంగులద్దుకోవాలి. రక్తాన్ని చమురుగా మార్చుకున్నవాడి దీపం మాత్రమే వెలుగుతుందనడానికి ఇదే నిదర్శనం. పురుషోత్తంనాయుడు నేతృత్వంలో సాయిరాం లాంటి బలమైన నేత ఎన్జీవో సంఘంలో ఉండాలని ఆహ్వానం వచ్చినప్పుడు అదృష్టం ఇంటి ముందు నాట్యం చేస్తే, చంద్రముఖి వచ్చిందని నాట్యం చేస్తూ కూర్చోకుండా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో అనేక ఒడిదొడుకుల మధ్య కూడా ప్రభుత్వాలు మారినప్పుడు దాన్ని తట్టుకొని ఎన్జీవో సంఘాన్ని జిల్లాలో నిలబెట్టగలిగారు. తుపాను వస్తే కదా.. పడవ గట్టిదనం తెలిసేది. బహుశా ఇటువంటి ఆటుపోట్లు లేకపోతే సాయిరాం నాయకత్వం ఇంత దూరం సాగేదికాదు. అలసట లేని యాత్రికుడికి సముద్రం కూడా రెండుగా చీలి దారి ఇస్తుందంటే ఇదేనేమో?! ముళ్ల మీద నడిచివెళ్లి గులాబీనందుకున్న సాయిరాం మొదటిసారి టౌన్ ప్రెసిడెంట్ అయినప్పుడు నగరంలో నేల ఈనిందా అన్నట్టు ఉద్యోగులతో సంబంధం లేకుండా ఆయన అభిమానులందరూ తీసిన ర్యాలీ అప్పట్లో ఒక రికార్డు. ఆ తర్వాత ఈ పోస్టు స్టేచర్ కూడా మారిపోయింది. రెక్కలున్నంత మాత్రాన మిడత ఆకాశ యానం చేయలేదు. సాయిరాం జిల్లా బాధ్యతలు స్వీకరించే వరకు ఆయనే ఎన్జీవో టౌన్ సంఘానికి నాయకుడు. పులిని ఎన్నుకోడానికి వన్యప్రాణులు క్యూలో నిలబడితే అమాయకత్వం. తమ దేవుళ్లు అడవి ప్రాణులేనని పులి చెబితే అది నాయకత్వం.










Comments