top of page

సెల్ఫీవీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 14
  • 1 min read
  • పురుగుల మందు సేవించిన టీడీపీ కార్యకర్త కుటుంబం

  • వారసత్వ భూమిని లేఅవుట్‌గా మార్చిన రెవెన్యూ యంత్రాంగం

  • లోకేష్‌కు ఫిర్యాదు చేశారని నీలగిరితోట ధ్వంసం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
ree

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా తెలుగుదేశం కార్యకర్త అయిన తన భూమికి రక్షణ లేకుండాపోయిందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకపోవడం వల్లే భార్యాభర్తలమిద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ పిల్లలకైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో పురుగుల మందు తాగేస్తున్నామంటూ సెల్ఫీ వీడియో ఒకటి రికార్డు చేసి, ఆత్మహత్యకు ప్రయత్నించిన దంపతుల వీడియో ఇప్పుడు జిల్లాలో విపరీతంగా ట్రోలవుతోంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వీడియో వెనుక ఉన్న కథనం బాధితుల స్టేట్‌మెంట్‌ మేరకు ఇలా ఉంది.

ree

శ్రీకాకుళం రూరల్‌ మండలం గూడెం గ్రామంలో నివసిస్తున్న శీర కోటేశ్వరరావుకు రాగోలు రెవెన్యూలో సర్వే నెం.179లో 1.90 ఎకరాలు, సర్వే నెం.180/1లో 1.50 ఎకరాలు మొత్తం 3.40 ఎకరాల వారసత్వంగా వచ్చిన భూమిని గత ప్రభుత్వం హయాంలో లే`అవుట్‌గా చూపించారు. సాగుహక్కు, అనుభవంలో వున్న సదరు భూమిని జగనన్న-భూరక్ష పథకంలో నిర్వహించిన రీ-సర్వేలో లే-అవుట్‌ కింద నమోదు చేశారు. సదరు భూమిని రీసర్వే చేసినప్పుడు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు లేఅవుట్‌గా మార్చేశారు. సదరు భూమి ఆన్‌లైన్‌లో శీర కోటేశ్వరరావు పేరుతో ఉన్నప్పటికీ పేరును తొలగించి లే-అవుట్‌ కింద నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులకు అర్జీలు సమర్పించినా న్యాయం జరగలేదు. దీంతో గ్రామంలోని కొందరు వైకాపా నాయకులు ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు కోటేశ్వరరావు ఈ నెల 9న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో రెవెన్యూ గ్రామ అధికారితో పాటు వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తల పేర్లను ప్రస్తావించారు. గ్రామసభలు, గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా సమస్యకు పరిష్కారం చూపించడం లేదని ప్రజాదర్బార్‌లో విన్నవించారు. ప్రజాదర్బార్‌లో విన్నవించి తిరిగి గ్రామానికి చేరుకునేలోగా సదరు భూమిలో ఉన్న నీలగిరి మొక్కలను నరికేశారు. దీంతో మనస్తాపానికి గురైన శీర కోటేశ్వరరావు, ఆయన భార్య అనసూయ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. పురుగులు మందు తాగడానికి ముందు సెల్ఫీవీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో స్థానికులు కొందరు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చి వారిద్దరినీ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌ అవుట్‌ పోస్టులో కేసు నమోదుచేసి శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు భార్యభర్తలు పరిస్థితి ప్రస్తుతం నిలకడిగా ఉంది.

ree

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page