top of page

సెలబ్రిటీలకు ఢల్లీ హైకోర్టే శరణ్యమా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 18, 2025
  • 2 min read

తన ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం చేస్తున్నారని, అనుమతి లేకుండా చాలామంది వాడుతుండటంతో పాటు ఏఐ టెక్నాలజీ సాయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఇటీవల ఢల్లీి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులను, బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కోర్టు ఆయనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని ఆదేశించింది. పవన్‌ కల్యాణే కాదు దేశంలోని చాలామంది సెలబ్రిటీలు తమ పర్సనాలిటీ రైట్స్‌ పరిరక్షించుకునేందుకు ఢల్లీి హైకోర్టునే ఆశ్రయిస్తుండటం పలు సందేహాలకు తావిస్తోంది. అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. బాలీవుడ్‌ స్టార్లు అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, హృతిక్‌ రోషన్‌, కరణ్‌జోహర్‌ వంటి ప్రముఖులు తమ చిత్రాలు, స్వరాలు, ఇతరత్రా తమ ఐడెంటిటీని అనధికారిక వాణిజ్య ఉపయోగానికి, మీడియాలో వినియోగానికి వ్యతిరేకంగా ఈ కోర్టులోనే పిటిషన్లు దాఖలు చేశారు. బాలీవుడ్‌ ప్రముఖులంటే ఢల్లీితో నిత్యం సంబంధాలు ఉంటాయి కనుక అక్కడి హైకోర్టును ఆశ్రయించారనుకోవచ్చు. కానీ ఢల్లీికి సుదూరంగా హైదరాబాద్‌, చెన్నైల్లో ఉంటున్న తెలుగు, తమిళ సినీ సెలబ్రిటీలు కూడా అక్కడికే క్యూ కడుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఢల్లీి ఉన్నత న్యాయస్థానంతో సెలబ్రిటీలకు ఏమైనా లింకులు ఉన్నాయేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే అవన్నీ అపోహలే. ఇటువంటి కేసుల్లో అవగాహన, అనుభవంతో కూడిన వేగవంతమైన తీర్పులు ఇవ్వడంలో ఢల్లీి ఉన్నత న్యాయస్థానం అత్యంత చురుగ్గా పని చేస్తుండటం వల్లే దక్షిణ, ఉత్తర భారతాలకు చెందిన సెలబ్రిటీలందరూ అక్కడికే క్యూ కడుతున్నారు. ఏఐ డీప్‌ఫేక్‌, మార్ఫింగ్‌, ఫేక్‌ సోషల్‌ మీడియా ఖాతాలు వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేలా త్వరితగతిన నిషేధాజ్ఞలు జారీ చేయడంతో ఈ కోర్టు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పర్సనాలిటీ రైట్స్‌ అంటే ఒక వ్యక్తి తన పేరు, చిత్రం, స్వరం, సంతకం, ఇతర గుర్తింపు లక్షణాలను అనధికారిక వాణిజ్య ఉపయోగాన్ని వ్యతిరేకించే హక్కు. మన దేశంలో దీనికి ప్రత్యేక చట్టం ద్వారా రక్షణ లేదు. కానీ కాపీరైట్‌ చట్టం (1957), ట్రేడ్‌మార్క్స్‌ చట్టం (1999), ఐటీ చట్టం (2000) వంటి చట్టాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ఆధారంగా పర్సనాలిటీ రైట్స్‌ను పరిరక్షించాల్సి ఉంటుంది. ఐటీ చట్టం సెక్షన్‌ 66సి (గుర్తింపు దొంగతనం), 66డి (అపాహన్‌), 66ఈ (గోప్యత ఉల్లంఘన) వంటివి డీప్‌ఫేక్‌ నేరాలకు వర్తిస్తాయి. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) చట్టం`2023 ప్రకారం అనధికారిక డేటా ఉపయోగానికి శిక్షలు విధించవచ్చు. మద్రాస్‌ హైకోర్టు 2011లో రజనీకాంత్‌ కేసులో అనధికారిక వాణిజ్య ఉపయోగాన్ని నిషేధించింది. ఢల్లీి హైకోర్టు 2023లో ఇలాంటి తీర్పే ఇచ్చింది. అయితే పేరడీలు, సెటైర్‌లకు మినహాయింపు ఇచ్చింది. 2024 మేలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కేసులో న్యాయస్థానం ఏఐ చాట్‌బాట్‌లు, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారాలకు నిషేధం విధించింది. మద్రాస్‌ హైకోర్టుతో పాటు మొదటి ఐపీ డివిజన్‌ను ఏర్పాటు చేసిన ఢల్లీి హైకోర్టు ఇలాంటి కేసుల్లో వేగవంతమైన రిలీఫ్‌ ఇస్తుంది. ఇటీవల కాలంలో ఎదురవుతున్న ఏఐ సవాళ్లకు సైతం ఈ ఉన్నత న్యాయస్థానం త్వరగా స్పందిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పులో ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లకు ఏఐ డీప్‌ఫేక్‌ల నుంచి రక్షణ కల్పించింది. అదే నెల 17న బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌కు మార్ఫింగ్‌, డిజిటల్‌ మానిప్యులేషన్‌ విషయంలో రక్షణ కల్పించింది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కేసుల్లో నిబంధనలు ఉల్లంఘించే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాలకు మూడు రోజుల్లోపు యాక్షన్‌ తీసుకోమని ఆదేశించింది. ఈమధ్య ఏఐ టెక్నాలజీ ఆధారంగా డీప్‌ఫేక్‌లు, వాయిస్‌ క్లోనింగ్‌లు పెరగడంతో సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు. బాంబే హైకోర్టు అరిజిత్‌సింగ్‌ కేసులో ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌ చేయడాన్ని నిషేధించింది. ఢల్లీి హైకోర్టు ఇంటర్‌మీడియరీ రూల్స్‌ ప్రకారం ఫేక్‌ కంటెంట్‌ను తక్షణం తొలగించమని ఆదేశిస్తోంది. షారుఖ్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, అజయ్‌దేవ్‌గణ్‌ వంటివారు తమ పేర్లను ట్రేడ్‌మార్క్‌లుగా రిజిస్టర్‌ చేసుకున్నారు. ఢల్లీి హైకోర్టు తీర్పులు ఆర్టికల్‌ 19(1)(ఎ) (ఫ్రీ స్పీచ్‌)తో బ్యాలెన్స్‌ చేస్తూ వాణిజ్య మోసాలకు మాత్రమే నిషేధం విధిస్తోంది. ఈ కారణంగానే పవన్‌కల్యాణ్‌తోపాటు టాలివుడ్‌ నటులు నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఇటువంటి పిటిషన్లతోనే ఢల్లీి హైకోర్టును ఆశ్రయించి చట్టపరమైన రక్షణ పొందారు. మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం ఢల్లీి వరకు వెళ్లకుండా హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేసి ఏఐ, డీప్‌ఫేక్‌ వంటి సాంకేతిక ఉల్లంఘనల నుంచి రక్షణ పొందారు. ఈ తరహా కేసుల విషయంలో ఐటీ చట్టాలపై అవగాహన కలిగి ఉండటమే కాకుండా సత్వర తీర్పులు ఇవ్వడమే కాకుండా ఢల్లీి హైకోర్టును ఆశ్రయించడానికి మరో ప్రబల కారణం కూడా ఉంది. దేశ రాజధానిగా ఉన్న ఈ మహానగరంలో దాదాపు ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల రిజిస్టర్డ్‌ కార్యాలయాలు ఉంటాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాకు సంబంధించి గూగుల్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సంస్థల కార్పొరేట్‌ కార్యాలయాలు ఢల్లీిలోనే ఉన్నాయి. వీటన్నింటినీ కంట్రోల్‌ చేసే సమాచార, ప్రసార శాఖ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌), సమాచార హక్కు ప్రధాన కార్యాలయం వంటివన్నీ అక్కడే ఉండటంతో ఢల్లీి హైకోర్టు ఇచ్చే తీర్పులు, మార్గదర్శకాలన్నీ వాటికి వెంటవెంటనే తెలుస్తుంటాయి. వీటి ద్వారా ఆయా రాష్ట్ర కార్యాలయాలకు సత్వరమే కోర్టు ఆదేశాలను చేరవేసి అమలు చేసే అవకాశం ఉంటుందన్న భావనతోనే దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు ఢల్లీి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page