top of page

సంస్కరణలతోనే ‘సాంకేతిక’ శ్రేయస్సు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 8, 2025
  • 3 min read
  • ఇంజినీరింగ్‌ విద్యపై మంత్రి లోకేష్‌ వ్యాఖ్యల కలకలం

  • పట్టా అందుకున్నా కోచింగ్‌ లేని ఉద్యోగం అందని పరిస్థితి

  • ఇంకా పాత పద్ధతుల్లోనే ఇప్పటికీ విద్యా బోధన

  • నామమాత్రం అమలవుతున్న ఇంటర్న్‌షిప్‌ ప్రొగ్రాం

  • అవసరాలకు తగినట్లు అప్‌డేట్‌ కావాలన్నదే ఆయన ఉద్దేశం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఇంజినీరింగ్‌, మెడికల్‌ కోర్సులంటే గతంలో ఎంతో మోజు ఉండేది. దానికి కారణం.. ఆ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు గ్యారెంటీ అన్న పరిస్థితి ఉండటమే. మెడిసిన్‌ సంగతి పక్కన పెడితే ఇంజినీరింగ్‌ కోర్సు లు చేసిన వారిని పారిశ్రామిక సంస్థలు కూడా కళ్లకు అద్దుకుని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చేవి. ఈ విషయంలో సంస్థలు పోటీ పడే పరిస్థితి ఉండేది. ఆ కారణంగానే విద్యార్థులు ఫైనల్‌ ఇయర్‌లో ఉండగానే బడా సంస్థలు కళాశాలలు, వర్సిటీల్లో క్యాంపస్‌ డ్రైవ్‌లు నిర్వహించి మరీ భారీ ప్యాకేజీలతో ప్రతిభావంతులైన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆఫర్‌ లెటర్లు ఇచ్చి.. రిజర్వ్‌ చేసుకునేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ స్వర్ణయుగం పోయి ఇంజినీరింగ్‌ చేసినా నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఇంజినీరింగ్‌ కళాశాలలు తామర తంపరగా పెరిగిపోవడం, అకడమిక్‌ సిలబస్‌ ఇంకా పాతదే కొనసాగుతుండటం, ఆధునిక సాంకేతికతకు అప్‌డేట్‌ కాలేకపోవడమే ఈ దుస్థితికి కారణం. బేసిక్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీతోపాటు అదనపు అర్హతలు ఉన్నవారు, కోచింగు ద్వారా పోటీ పరీక్షలకు అప్‌టుడేట్‌గా సన్నద్ధత సాధిస్తున్నవారే ఉద్యోగాలు సంపాదించగలుగుతున్నారు. ఫలితంగా కోచింగ్‌ కేంద్రాలకు ఈమధ్య కాలంలో బాగా డిమాండ్‌ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మంత్రి వ్యాఖ్యలపై భిన్న స్పందన వ్యక్తమవుతోంది. ‘నాలుగేళ్లు ఇంజినీరింగ్‌ చదివినా రాని ఉద్యోగం హైదరాబాద్‌ అమీర్‌పేటలో నాలుగు నెలలు కోచింగ్‌ తీసుకుంటే వస్తోంది’ అని మంత్రి లోకేష్‌ చేసిన వ్యాఖ్యలతో కొందరు షాక్‌ అయ్యారు. కోచింగ్‌ తీసుకుంటే సరిపోతుందా.. ఇంజినీరింగ్‌ చదవాల్సిన అవసరం లేదా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్నవారు లోకేష్‌ వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పాలి. లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను అనుచితమని గానీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులను అవమానించడమని గానీ భావించకూడదు. ఇంజినీరింగ్‌ కళాశాలలు సంపాదన దృష్టితో పుంఖానుపుంఖాలుగా పెరిగిపోయి ఏటా లక్షలాది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ప్రపంచంలోకి పంపుతున్నాయి. కానీ నాలుగేళ్లు చదివి బయటకొచ్చిన మెజారిటీ విద్యార్థులు నేటి పరిశ్రమలకు, ఇతర సంస్థలకు అవసరమైన ఆధునికి సాంకేతిక నైపుణ్యం(స్కిల్స్‌) కొరవడుతున్నాయన్నది వాస్తవం. ఈ స్కిల్‌ గ్యాప్‌నే ప్రస్తావిస్తూ లోకేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవాలి.

పాత పద్ధతులతోనే చేటు

రాష్ట్రంలోని చాలా ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇంకా పాత సిలబస్‌నే బోధిస్తున్నారు. మూడు, నాలుగేళ్ల కిందటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌, పాత ప్రాజెక్టులు, ఔట్‌ డేటెడ్‌ పద్ధతుల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. కానీ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గరిష్టస్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఐటీ కంపెనీలు ఆధునిక సాంకేతికతతో కూడిన ఏఐ, డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, గ్రీన్‌ ఎనర్జీ వంటి సరికొత్త రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని కోరుకుంటున్నాయి. కానీ కళాశాలల్లో ఆ సబ్జెక్టులు బోధించబడటం లేదు. దానివల్ల డిగ్రీ పట్టాతో విద్యార్థులు బయటకొచ్చినా ఉద్యోగానికి మాత్రం అర్హులు కాలేకపోతున్నారు. సాఫ్ట్‌ స్కిల్స్‌తోపాటు టెక్నికల్‌ స్కిల్స్‌ కొరత నేటి విద్యార్థుల్లో కనిపిస్తోందని హైదరాబాద్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు అభిప్రాయపడ్డారు. దీన్నే ఆసరా చేసుకుని అక్కడి కోచింగ్‌ సెంటర్లు ‘జాబ్‌ ఓరియెంటెడ్‌ ట్రైనింగ్‌’ ఇస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాయి. కంపెనీలు కూడా ఇలా శిక్షణ పొందిన విద్యార్థులను సులభంగా తీసుకుంటున్నాయి. కొన్ని కోచింగ్‌ సెంటర్ల ఐటీ కంపెనీలతో లింకులు కూడా ఉన్నాయంటారు. లోకేష్‌ వ్యాఖ్యలు ఈ పరిస్థితులనే దర్పణం పడుతూ ఇంజినీరింగ్‌ విద్యావ్యవస్థను ప్రక్షాళించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెబుతున్నాయి. అందుకే కళాశాలలు పరిశ్రమలతో నేరుగా అనుసంధానం కావాలని అయన అన్నారు. దానికి అనుగుణంగానే ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, విశ్వవిద్యాలయాలను పరిశ్రమలతో లింక్‌ చేయండి అని కూడా ఆదేశించారు. ప్రతి కళాశాల ‘నైపుణ్యం పోర్టల్‌’కు కనెక్ట్‌ అయి విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు కల్పించాలని స్పష్టం చేశారు. దీన్ని అర్థం చేసుకోలేని కొందరు లోకేష్‌ వ్యాఖ్యలను ‘ఇంజినీరింగ్‌ విలువ తగ్గించడం’ అన్నట్లు భావిస్తున్నారు.

పనితనంతోనే చదువు

విద్య అంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు. విద్యార్థి ఉద్యోగం చేయడానికి సరిపడే నైపుణ్యం సంపాదించాలి. ఇదేమీ కొత్త ఆలోచన కాదు. అనేక దేశాలు ఇప్పటికే ‘ఇండస్ట్రీ లింక్డ్‌ ఎడ్యుకేషన్‌’ వ్యవస్థను అమలు చేస్తున్నాయి. అక్కడ కంపెనీలు, కాలేజీలు కలసి అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందిస్తాయి. నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో చేరే విద్యార్థి నాలుగేళ్ల కోర్సు కాలంలో అకడమిక్‌ విద్యతోపాటు ఏదైనా కంపెనీలో ఇంటర్న్‌గా పని చేస్తూ కంపెనీల అవసరాలకు తగిన స్కిల్‌ కూడా సంపాదిస్తాడు. మనదేశంలో కూడా ఇంటర్న్‌షిప్‌ అమలు చేస్తున్నా.. చాలావరకు ఇది నామమాత్రంగానే ఉంటుందని అభిప్రాయం ఉంది. అయితే కోచింగ్‌ సెంటర్లు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. కళాశాలలే విద్యాబోధనతోపాటు స్కిల్‌ ట్రైనింగ్‌ కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలతో కళాశాలలను లింక్‌ చేయడం మంచిదే. అయితే ఈ ప్రక్రియ ప్రభుత్వ పర్యవేక్షణలో పారదర్శకంగా సాగాలి. అధ్యాపకులకు కూడా ఎప్పటికప్పుడు స్కిల్‌ అప్‌డేట్‌ ట్రైనింగ్‌ అవసరం. విద్యను పూర్తిగా ‘జాబ్‌ సెంట్రిక్‌’గా మార్చడం కూడా ప్రమాదమేనని, విద్యలో విలువలు, పరిశోధన, ఆలోచన శక్తి కూడా అవసరమేనని ఒక ఇంజినీరింగ్‌ నిపుణుడు అభిప్రాయపడ్డారు. లోకేశ్‌ వ్యాఖ్య అమీర్‌పేటలో కోచింగ్‌ కేంద్రాలను ప్రమోట్‌ చేస్తున్నట్లు ఉన్నా .. విద్యావ్యవస్థను వాస్తవ అవసరాలకు తగినట్లు మలచాలన్న పిలుపు దాని వెనుక ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page