top of page

సొసైటీ స్థలంలో అక్రమాల అంతస్తులు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 4 hours ago
  • 2 min read
  • అనుమతులు తీసుకోలేదు.. నిబంధనలు పాటించలేదు

  • కలెక్టర్‌ నుంచి ఈవో వరకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు నిల్‌

  • సుడా నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయకుండా నిర్మాణం

  • స్థానిక రాజకీయుల అండతో రెచ్చిపోతున్న నిర్మాణదారు

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

బంగారంతో పాటు ఇతరత్రా అనే సరుకులకు హోల్‌సేల్‌ మార్కెట్‌గా ఉన్న నరసన్నపేట పట్టణంలో అదే స్థాయిలో అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. మేజర్‌ పంచాయతీ అయిన నరసన్నపేట జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పేరొందడంతో భూములు, స్థలాలకు, ఇళ్లకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో పట్టణం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిపోయింది. ప్రభుత్వాలు మారినా అక్రమార్కుల అజెండా మాత్రం ఆక్రమణలే అన్నట్లు తయారైంది పరిస్థితి. నరసన్నపేట పంచాయతీ శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) పరిధిలో ఉన్నా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు ఈ సంస్థ నుంచి నిర్మాణదారులు అనుమతులు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. రాజకీయ నాయకులే అక్రమార్కులను ప్రోత్సహిస్తుండటం వల్ల సుడా సంస్థ ఉందన్న విషయాన్నే ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై కొరడా రaుళిపించాల్సిన పంచాయతీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అపార్ట్‌మెంట్‌ నిర్మాణమే దీనికి నిదర్శనమంటున్నారు. సుడా అప్రూవల్‌ తీసుకోకుండా దీన్ని నిర్మిస్తున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారులు అడ్డుకోకపోవడం పట్టణంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అక్రమ నిర్మాణంపై గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారులు విమర్శిస్తున్నారు. కనీసం నిర్మాణాన్ని అయినా ఆపించలేదంటున్నారు. కాగా అనుమతులు తీసుకోనందున నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని సుడా అధికారులు ఈ ఏడాది మే 14న నోటీసులు ఇచ్చినా నిర్మాణదారుడు ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్మాణం కొనసాగిస్తున్నారు. కొందరు కూటమి నాయకుల అండదండలు ఉన్నందునే భవన యజమాని ధీమాగా నిర్మాణం కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదులన్నీ బుట్టదాఖలు

నరసన్నపేట కో`ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ద్వారా దఖలు పడిన స్థలంలో చేపట్టే నిర్మాణాలకు సొసైటీ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉండగా, వాటికి విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారని హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ప్రతినిధులు సైతం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సొసైటీ ద్వారా లభించిన స్థలంలో నివాస గృహం తప్ప మరే ఇతర నిర్మాణాలు చేపట్టకూడదన్న షరతుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారు. స్థలాన్ని ఇతరులకు బదలాయించడం, విక్రయించడం, మార్ట్‌గేజ్‌ చేయడానికి కూడా వీల్లేదు. కేవలం సొసైటీ సభ్యులకు మాత్రమే విక్రయించాలి, బదలాయించాలి. అపార్ట్‌మెంట్లు, ఇతర వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించకూడదు. స్థలం అభివృద్ధి పేరుతో లావాదేవీలు నిర్వహించడం కూడా సొసైటీ నిబంధనలకు విరుద్ధమే. అలాగే సొసైటీ నుంచి ఎన్‌ఓసీ, గ్రామ పంచాయతీ ఈవో నుంచి ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకున్న తర్వాతే నిర్మాణం చేపట్టాలి. గృహ వినియోగానికి మించిన నిర్మాణాలు చేపట్టాలనుకుంటే సొసైటీ నుంచి ముందుగానే రాతపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సదరు ఎ`8 స్థలం యజమాని డిక్లరేషన్‌ ఇచ్చారని, అయితే నిర్మాణదారుడు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పనులు చేస్తున్నారని కలెక్టర్‌, తహసీల్దార్‌, పంచాయతీ ఈవో, సుడా చైర్మన్‌లకు సొసౖౖెటీ ప్రతినిధులు ఫిర్యాదు చేసినా వారెవరూ చర్యలు తీసుకోలేదు. అనుమతి లేకుండా పట్టణంలో అనేక చోట్ల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో పట్టణంలో నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా పదుల సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అధికారులను ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి భవనాలు కట్టేస్త్తున్నవారూ ఉన్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే పట్టణ పరిధిలో ఉన్న చెరువులన్నీ కనుమరుగైపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల స్థలాల్లో అక్రమంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page