సమీకృత కలెక్టరేట్ కల.. నిధుల లేమితో కళవెళ!
- BAGADI NARAYANARAO

- 3 days ago
- 2 min read
ఉగాదికి ప్రారంభించాలన్న కృతనిశ్చయంతో కలెక్టర్
ఇంకా పూర్తి కాని మౌలిక వసతుల కల్పన
నిర్మాణంలో జాప్యంతో పెరిగిన నిర్మాణ వ్యయం
బకాయిలు చెల్లించనిదే పనులు చేయలేనంటున్న కాంట్రాక్టర్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
దశాబ్దం కల.. మరో నాలుగు నెలల్లో సాకారం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ఉగాది నాటికి ప్రారంభించి జిల్లా పరిపాలనను అక్కడి నుంచే నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కృతనిశ్చయంతో ఉన్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో తుది దశలో ఉన్న పనులన్నింటినీ నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులతో సమన్వయం చేసుకొని కార్యచరణ రూపొందించారు. మొత్తం 84 ప్రభుత్వ శాఖలకు కొత్త పరిపాలనాభవన కాంప్లెక్స్‌లో గదులు కేటాయించే ప్రక్రియను కలెక్టర్ గురువారం జేసీ ఫర్మాన్ ఆహ్మాద్‌తో కలిసి చేపట్టారు. 84 శాఖలను పది కేటగిరీలుగా వర్గీకరించి గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవన సముదాయంలో గదులు కేటాయించారు. ప్రాథమిక రంగం, సహజవనరులు, పరిశ్రమలు`ఉపాధి, మానవ వనరులు, సామాజిక సంక్షేమం, వైద్యఆరోగ్యం, పట్టణాభివృద్ది, గ్రామీణాభివృద్ది, సేవారంగం, రెవెన్యూ విభాగం, సాధారణ పరిపాలన కేటగిరీలుగా ప్రభుత్వ శాఖలను విడదీశారు. ఆయా కేటగిరీల పరిధిలో ఉన్న శాఖలకు కేటాయించిన గదుల్లో హెచ్‌వోడీ, స్టోర్, రికార్డ్‌రూం, తగినంత వర్క్ స్పేస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. శాఖలకు కేటాయించిన గదులను స్వాధీనం చేసుకుని ఎటువంటి ఫర్నిచర్ అవసరమో గుర్తించి ఇండెంట్ సిద్ధం చేసే బాధ్యతను ఆయా శాఖల అధికారులకే అప్పగించారు. కొత్త భవన సముదాయంలో 30 గదులకు మాత్రమే టాయిలెట్ సౌకర్యం కల్పించారు. మిగతా శాఖల కార్యాలయాలకు కామన్ టాయిలెట్‌లను మహిళా, పురుషులకు వేర్వేరుగా అన్ని అంతస్తుల్లోనూ నిర్మిస్తున్నారు.
వెనక్కి లాగుతున్న నిధుల సమస్య
నాలుగు నెలల్లో నూతన కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా నిధులు లేమి వెంటాడుతోంది. సమీకృత కలెక్టరేట్ నిర్మాణాన్ని రూ.116 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.76 కోట్లు చెల్లించారు. ఇంకా మిగిలిన విద్యుత్, శానిటేషన్, సీలింగ్ సహా పలు పనులు పూర్తి చేయడానికి మరో రూ.20కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. దీనికి అదనంగా కార్యాలయాల్లో ఫర్నీచర్, హెచ్‌వోడీ కేబిన్‌లకు ఏసీలు, భవనం ఎలివేషన్, ఇతర మౌలిక సౌకర్యాల పనులకు రూ.31 కోట్లు కావాలని కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు దీనిపై స్పష్టత రాలేదు. అయితే తనకున్న ప్రత్యేక అధికారాలతో కలెక్టర్ నిధుల నుంచి రూ.6 కోట్లు వెచ్చించి విద్యుత్, ఫ˜ర్నీచర్, లిఫ్ట్‌లు, సెంట్రలైజ్డ్ ఏసీ తదితర పనులు చేయించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేస్తే ఈ రూ.6 కోట్లను రీయింబర్స్ చేయాలని నిర్ణయించారు. దీంతో నూతన కలెక్టరేట్‌లో కార్యాలయాల ఏర్పాటు పనులు వేగం పుంజుకున్నాయి. ఆన్ని శాఖల హెచ్‌వోడీల కేబిన్‌లు, వర్క్ స్పేస్ ఒకేలా ఉండేలా ఇంటీరియర్, ఫర్నీచర్ సౌకర్యం కల్పించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కార్యాలయాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన తర్వాత విద్యుత్ బిల్లులను ఆయా శాఖలే భరించుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు.
ఇంకా రూ.46 కోట్లు అవసరం
ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.76 కోట్లు చెల్లించగా, మిగతా పనులు పూర్తి చేయడానికి రూ.46 కోట్లు అవసరమని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. భవనాల నిర్మాణం దాదాపు పూర్తి అయిందని, మౌలిక వసతులు కల్పించడమే మిగిలి ఉందని వారు చెబుతున్నారు. ఇదే కష్టసాధ్యమంటున్నారు. కలెక్టర్ నిధుల నుంచి రూ.6 కోట్లు ఖర్చు చేస్తే పనులన్నీ పూర్తి అయిపోతాయని భావిస్తున్నా ఆ వాదనలో వాస్తవికత లేదు. ఇప్పటికే భవనం ఎలివేషన్‌కు, ముఖ ద్వారం నిర్మాణానికి కలెక్టర్ నిధుల నుంచి రూ.74 లక్షలు వెచ్చించారు. సముదాయం మొత్తానికి విద్యుత్ సౌకర్యం కల్పించడానికి రూ.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఫర్నీచర్ కోసం గోద్రెజ్ సంస్థ నుంచి కొటేషన్లు ఆహ్వానించారు. ఫర్నీచర్‌కు రూ.2 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ప్లంబింగ్ పనులు, టాయిలెట్స్ పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. వీటిని భవన నిర్మాణ కాంట్రాక్టర్ ద్వారానే గడువులోగా పూర్తి చేయించాలని ఉన్నతాధికారులు ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అంతా బాగానే ఉన్నా గడువులోగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా అన్న అనుమానం అధికారుల్లో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే నిధులు రానిపక్షంలో ఆయా శాఖలే తమకు కేటాయించిన గదుల్లో ఫర్నీచర్, ఇతర మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులకు సూచించినట్టు తెలిసింది. విద్యుత్, లిఫ్ట్ పనుల వరకు కలెక్టర్ నిధులతో పూర్తి చేస్తే, మిగతా పనులు ఆయా శాఖలే చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కలెక్టర్ ప్రతిపాదనకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఉగాది నాటికి పూర్తిస్థాయిలో కొత్త కలెక్టరేట్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, లేదంటే నిధుల కోసం వేచి చూడాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
పాత రేట్లకు చేయడం అసాధ్యం
కాగా బకాయి బిల్లులు చెల్లించకపోతే పనులు చేయడం సాధ్యం కాదని కాంట్రాక్టర్ స్పష్టం చేస్తున్నారు. దశాబ్దం క్రితం రూపొందించిన అంచనా వ్యయాన్ని ఇప్పటి ధరలకు అనుగుణంగా సవరించకపోవడం వల్ల తాము నష్టపోయామని ఆయన అంటున్నారు. దీనికితోడు నిధుల మంజూరులో జాప్యం కారణంగా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనివల్ల బ్యాంకుకు రుణం రూపంలో రూ.13 కోట్లు చెల్లించామంటున్నారు. ఇంకా మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి ఉందని, నిధులు ఇస్తే తప్ప గడువులోగా పనులు పూర్తి చేయలేమని కాంట్రాక్టర్ చెబుతున్నారు.










Comments