top of page

సమాచార హక్కుకు ముకుతాడు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read

ree

వ్యక్తిగత గోప్యత పరిరక్షణ కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తిగత డిజిటల్‌ సమాచార రక్షణ చట్టంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ చట్టం నిబంధనలు సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడిచేలా ఉన్నాయని ఎడిటర్స్‌ గిల్ద్‌, డిజిపబ్‌ న్యూస్‌ ఫౌండేషన్‌ వంటి సమాచార రంగ వ్యవస్థలు అభిప్రాయపడ్డాయి. తాజా నిబంధనలు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయటమే కాక పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తాయంటున్నారు. ఈ నిబంధనలు విలేకరులపై అనేక పరిమితులు విధిస్తూ విధి నిర్వహణలో అవాంతరాలు కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డాయి. రెండేళ్ల క్రితమే రూపొందించిన ఈ నిబంధనలను ఈ నెల 15న కేంద్రం విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో భారతీయుల వ్యక్తిగత గోప్యతను కాపాడే మొదటి అడుగుగా దీన్ని ప్రభుత్వం అభివర్ణించింది. ఈ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ కార్యకలాపాలు నిర్వహించేవారు తప్పనిసరిగా వీక్షకుల అనుమతి పొందాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా ఆన్‌లైన్‌ యాప్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌లలో లాగినై చూసినా, విన్నా, మెసేజ్‌ పెట్టినా అది డిజిటల్‌ రికార్డ్‌లో నమోదవుతుంది. ఇది ఇప్పుడూ జరుగుతోంది. కాకపోతే తాజా చట్టం ప్రకారం ఇక మీదట ఎవరైనా ఆన్‌లైన్‌ వీక్షకుడు లేదా ఖాతాదారుడు తాను సందర్శించిన వెబ్‌సైట్‌, దానికి వినియోగించిన కంప్యూటర్‌ ఐపీ అడ్రస్‌ వివరాలు తొలగించాలని కోరితే ఆ డిజిటల్‌ రికార్డును తొలగించక తప్పదు. ఈ మేరకు కంపెనీలు తమ విధి విధానాలు మార్చుకునేందుకు కేంద్రం 18 నెలల గడువు విధించింది. దశలవారీగా 18 నెలల్లో ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తేనున్నారు. ఇందులో భాగంగా వివిధ ఆన్‌లైన్‌ వేదికలు, సంస్థల విధివిధానాల అమలుకు వీలుగా డిజిటల్‌ ప్రొటెక్షన్‌ బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు ఆ బోర్డు పని తీరును నిర్దేశించే మార్గదర్శకాలు రూపొందించటం, వాటిని ఉల్లంఘించే వారికి విధించే జరిమానాలను కూడా ఖరారు చేయనున్నారు. అయితే ఈ చట్ట నిబంధనలు పాత్రికేయ వృత్తికి ప్రతిబంధకాలుగా మారి కొత్త ఇబ్బందులు సృష్టిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరులూదిన సమాచార హక్కు చట్టాన్ని సమాధి చేసేలా ఉన్నాయి. ఇప్పటివరకు విలేకరులకు ఉన్న ప్రత్యేక అవకాశాలను ఈ చట్టం రద్దు చేస్తోంది. ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన బోర్డులకు నిర్దేశించిన విధివిధానాలు గమనిస్తే కొత్త తరహా ప్రెస్‌ సెన్సార్‌షిప్‌ అమలు కాబోతున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛపై విపరీతమైన ఆంక్షలు విధించటమేకాక వార్తా సేకరణకు చేసే ప్రయత్నాలపై పర్యవేక్షణ, నిఘా మరింత తీవ్రమవుతుంది. వ్యవస్థల్లోని అవినీతికి వెలికితీసే వార్తా సేకరణ మరింత క్లిష్టంగా మారుతుంది. ప్రజాస్వామిక వ్యవస్థ మనుగడకు అవసరమైన సమాచార ప్రసార వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. జర్నలిస్టులకు ఉండే రక్షణలను తొలగించటం పట్ల గతంలోనే ప్రభుత్వానికి సంబంధిత వ్యవస్థలు సవివరంగా అభ్యంతరాలు తెలిపాయి. ప్రత్యేకించి ఈ చట్టంలోని సెక్షన్‌ 44(3) సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ (జె)(1)ని నీరుగారుస్తుంది. సమాచార హక్కు చట్టంలోని ఈ సెక్షన్‌ కింద ప్రజా ప్రయోజనం రీత్యా ఎటువంటి సమాచారాన్నయినా సేకరించే స్వేచ్ఛ సాధారణ ప్రజలకు, జర్నలిస్టులకు ఉంది. కానీ తాజా చట్టంతో అది గంగలో కలిసిపోతుంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. తాజా చట్టం కింద కనీసం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలను బహిరంగపరుస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారులు ప్రకటించినా వాటిని ప్రకటించలేదు. ఈ చట్టం రాజ్యాంగం ఖాయం చేసిన భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని డిజీపబ్‌ ప్రకటించింది. జర్నలిజం స్ఫూర్తికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట నిబంధనల్లో అవరమైన మార్పులు చేయాలని, కావలసిన వివరణలు ఇవ్వాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ కూడా కేంద్ర సమాచార సాంకేతిక శాఖను కోరింది. ఈ మేరకు ఓ 35 ప్రశ్నలతో కూడిన లేఖ రాసింది. అయినా ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన కరువైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నియమ నిబంధనలు తాము లేవనెత్తిన ఆందోళనలను ఉపశమింపజేసేవిగా లేవని ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం అనుమతులు ముందస్తుగానే తీసుకోవడమంటే రోజువారీ వార్తా సేకరణ వంటి వృత్తిపరమైన పనుల్లో అనేక అవరోధాలను కొనితెచ్చుకోవడమేనని మీడియా వ్యవస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్పష్టమైన వివరణ లేకుండా కేవలం జర్నలిస్టుల వృత్తిపరమైన అంశాలకు కూడా చట్టపరమైన అనుమతులు తీసుకోవాలన్న షరతు విధించటం జర్నలిజం స్వతంత్రతను, స్వేచ్ఛను హరిస్తుందని ఎడిటర్స్‌ గిల్డ్‌ రాసిన లేఖలో ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం రోజువారీ జర్నలిస్టుల పనులకు ఎలా వరిస్తుందో స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని గిల్డ్‌ అభిప్రాయపడిరది. ఇటువంటి స్పష్టమైన వివరణలు లోపించిన నేపథ్యంలో రోజువారీ జర్నలిజం వృత్తి నీరుగారిపోతుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో మీడియా పోషించాల్సిన పాత్రను కొత్త చట్టం కుదించివేస్తుంది. డేటా రక్షణ, వ్యక్తిగత గోప్యత కీలకమైన అంశాలేననడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో వీటికి ఇచ్చే ప్రాధాన్యత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన కనీస రక్షణలకు భంగం కలిగించేదిగా ఉండరాదని ఎడిటర్స్‌ గిల్డ్‌ అభిప్రాయపడిరది. ఇప్పటికైనా ఈ చట్టంపై కేంద్రం తగినరీతిలో స్పందించాల్సి ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page