సర్కారుపై సానుకూలత ఇసుమంత!
- BAGADI NARAYANARAO

- Jan 9
- 2 min read
ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో వెల్లడైన ప్రజా అసంతృప్తి
రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోనే తక్కువ సంతృప్తస్థాయి
జిల్లా యంత్రాంగంపై పెరుగుతున్న ఒత్తిడి
పని చేస్తున్న తమను బాధ్యులను చేయడంపై ఉద్యోగుల ఆవేదన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పథకాలు, సేవల వారీగా ప్రజల స్పందనను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ప్రభుత్వ సేవల పట్ల అంతగా సానుకూలత వ్యక్తం కావడంలేదని ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. సంతృప్తస్థాయి తక్కువగానే ఉందని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్‌ను జిల్లా చేరుకోలేకపోతోంది. దీనికి కారణం జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం పనితీరేనని ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పథకాలు, సేవలను మెరుగ్గా అందించి సంతృప్తస్థాయి పెంచేందుకు జిల్లా అధికారులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడంలేదని అంటున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి రాష్ట్రప్రభుత్వం ఆర్‌టీజీఎస్ వ్యవస్థలో భాగంగా ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా పథకాల లబ్ధిదారులు, ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ సేకరిస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సేవల పట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయిని అంచనా వేసి.. ఆ మేరకు జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంటుంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్ నుంచి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
పని చేస్తున్నా.. మాట పడాలా..
ఆయా శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతోందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రతి వారం సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ శాఖలకు దిశానిర్దేశం చేస్తున్నా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదనే భావన రాష్ట్ర ఉన్నతాధికారుల్లో కనిపించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం `2, రేషన్ పంపిణీ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాలతోపాటు రిజిస్ట్రేషన్లు, ఆర్టీసీ, గృహనిర్మాణం వంటి సేవల విషయంలో ఆశించినంత సానుకూల స్పందన లేదని తెలిసింది. అధికారులు మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పౌరసేవలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందిస్తున్నామని చెబుతున్నారు. అధికారులు, ఉద్యోగుల జాబ్‌చార్ట్‌లో ఎక్కువ సమయం వీటికే కేటాయిస్తున్నట్టు చెబుతున్నా.. ప్రభుత్వం వారి వాదనతో ఏకీభవించడంలేదు. ఐవీఆర్‌ఎస్ కాల్స్‌కు వచ్చే ఫీడ్‌బ్యాక్ గ్రామ, వార్డు, మండల, మున్సిపాలిటీ, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో సంతృప్తి స్థాయిని వేర్వేరుగా లెక్కిస్తుంది. అయితే ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వ యంత్రాన్ని బాధ్యులను చేయడాన్ని అధికారవర్గాలు అసలు అంగీకరించడం లేదు. ప్రభుత్వ నిర్ణయాల మేరకు సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందిస్తున్నామని, వీటివల్ల పని ఒత్తిడి పెరుగుతున్నా భరిస్తున్నామని, అయినా తమనే బాధ్యులను చేయడం పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఐవీఆర్‌ఎస్ అసంతృప్తి ఇలా..
గ్రామాల్లో చెత్త సేకరణ విధానం అమల్లోకి వచ్చినా ఎక్కడా అమలు కావడం లేదు. దీనిపై ఫీడ్‌బ్యాక్ కోరితే చెత్త సేకరణకు ఎవరూ రావడం లేదని గ్రామీణ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.
దీపం`2 పథకం కింద ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం రెండు విడతల్లోనే ఉచిత సబ్సిడీ అందజేశారు. మూడో విడత సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదని మెజారిటీ లబ్ధిదారులు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కాగా సబ్సిడీ మొత్తాలను ప్రభుత్వమే జమ చేయాలని, దానికి కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఎలా బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చౌకధరల దుకాణాల ద్వారా కోటా బియ్యాన్ని ప్రతినెలా 15వ తేదీ వరకు ఇవ్వాలి. ఆలోగా లబ్ధిదారులు తమ వెసులుబాటును బట్టి తీసుకుంటారు. అయితే గడువులోగా వారు విడిపించలేదని సమాచారం ఇస్తే దానికి పౌర సరఫరాల శాఖ అధికారులు, డీలర్లు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. అన్న క్యాంటీన్లు గ్రామాల్లో లేనందున వాటి గురించి గ్రామీణ ప్రజల అభిప్రాయం కోరడం అసంబద్ధం. మరోవైపు వేలు, లక్షల జనాభా ఉండే పట్టణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోనే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంటీన్‌లో రోజూ సగటున 500 మందికి మాత్రమే భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. అందువల్ల అందరికీ దీనిపై అవగాహన ఉండదు. కానీ అందరి నుంచీ ఫీడ్‌బ్యాక్ తీసుకు అదే నిజమన్నట్లు అధికారులపై రుద్దితే ఎలా అన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఉద్యోగులపై ఒత్తిడి
వీటితోపాటు అనేక సంక్షేమ పథకాలు, ప్రభుత్వ శాఖలు అందించే పౌరసేవలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుండడంతో ప్రతివారం దీనిపై రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వివరణ కోరుతున్నారు. రాష్ట్ర అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా జిల్లా అధికారుల నుంచి వివరణ కోరి వారి పనితీరును ఎండగడుతున్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద ఇబ్బందిగా మారింది. రోజూ కొంత సమయం దీనిపైనే కేటాయించి పని చేయాల్సిన పరిస్థితి వస్తుందని, దీనివల్ల రోజువారీ పనుల్లో జాప్యం జరుగుతోందని, పనిభారం పెరిగిందని అధికారులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










Comments