సర్కారు సేవల వారధి.. దయానిధి!
- DV RAMANA

- Jun 19
- 3 min read
మూడు దశాబ్దాల సుదీర్ఘ సర్వీసులో ఎన్నో విజయాలు
భూసేకరణ వివాదాల పరిష్కారంలో దిట్టగా పేరు
ఏ హోదాలో.. ఎక్కడ పని చేస్తున్నా ప్రజల పక్షమే
డిప్యూటీ తహసీల్దార్ నుంచి స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయికి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఒక ఎత్తు.. సర్వీసులో ఎత్తుపల్లాలు అధిగమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించడం మరో ఎత్తు. ప్రభుత్వ ఉద్యోగులు లక్షల్లోనే ఉంటారు. కానీ సర్వీసుల్లో ప్రజలకు, ప్రభుత్వానికి ఏదో చేశామని, ఎంతో సాధించామన్న ఆత్మసంతృప్తి కొందరికే లభిస్తుంది. ఏళ్ల తరబడి ప్రమోషన్ లేకపోయిన నిరాశ చెందకుండా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ.. తమకు అప్పగించిన బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేవారు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన అధికారుల్లో బలివాడ దయానిధి ఒకరు. డిప్యూటీ తహసీల్దార్‌గా మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వ సర్వీసులో చేరిన ఆయన సుమారు 15 ఏళ్లు ఆలస్యంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా అధికారికంగా పదోన్నతి పొందినా కొన్నేళ్ల క్రితం నుంచే ఆ హోదాలో పని చేస్తున్నారు. ఆ హోదాలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా పలు ప్రాజెక్టుల భూసేకరణ విభాగాల్లో పని చేసి.. వివాదాలకు అతీతంగా వ్యవహరించడం ద్వారా అటు ప్రభుత్వ, ఇటు రైతుల మన్ననలు పొందారు. ప్రస్తుతం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) ఎస్టేట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న దయానిధితోపాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 58 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 2010లోనే అందాల్సిన ఈ ప్రమోషన్లు పలు కారణాలతో ప్రభుత్వ స్థాయిలో నిలిచిపోయాయి. ఎట్టకేలకు సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రమోషన్ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. దాంతో ఇప్పుడు కొత్త హోదాలోనే దయానిధి వీఎంఆర్‌డీఏ ఎస్టేట్ ఆఫీసర్‌గా కొనసాగనున్నారు.
మూడు దశాబ్దాల ప్రస్థానం
ఏపీపీఎస్సీ 1995లో నిర్వహించిన గ్రూప్`2ఏ నియామక పరీక్షల్లో విజయం సాధించిన దయానిధి ఏడాది శిక్షణ అనంతరం 1996లో సారవకోట డిప్యూటీ తహసీల్దార్‌గా తొలి పోస్టింగ్ అందుకున్నారు. అనంతరం 1999-2000 మధ్య సంతకవిటిలో, 2003-2004 మధ్య కంచిలి తహసీల్దార్‌గా పని చేశారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ క్యాడర్‌లోకి వెళ్లారు. 2011`12 మధ్య సింహాచలం దేవస్థానం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ప్రొటెక్షన్)గా, 2012`13 మధ్య పాలకొండ ఆర్డీవోగా, 2013`14 మధ్య విశాఖలో నేవీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్(భూసేకరణ)గా పని చేశారు. 2014`18 మధ్య శ్రీకాకుళం ఆర్డీవోగా, 2018`19 మధ్య ఉమ్మడి విశాఖ జిల్లా డ్వామా పీడీగా, 2019లో రాజమండ్రిలో గెయిల్(గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)గా, 2019`22 శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా, 2022`23 మధ్య అల్లూరి(పాడేరు) జిల్లా రెవెన్యూ అధికారిగా, 2023`24 మధ్య అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారిగా విశేష సేవలు అందించిన దయానిధి ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మకమైన వీఎంఆర్‌డీఏకు ఎస్టేట్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలో కీలక బాధ్యతలు
తన సర్వీసులో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ కాలంలో వివిధ హోదాల్లో పని చేసిన దయానిధి.. ఎన్నో ముఖ్యమైన టాస్క్‌లను నిబద్ధతతో చాకచక్యంగా పూర్తి చేసి ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. పాలకొండ ఆర్డీవో బాధ్యతలు స్వీకరించడానికి కొద్దిరోజుల ముందే వంగర మండలం లక్ష్మీపేటలో ఐదుగురు దళితుల ఊచకోత ఘటన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. ఆ తరుణంలో ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దయానిధి ఆ ప్రాంతంలో శాంతిభద్రల పరిరక్షణ, బాధితులకు పునరావాసం కల్పించడంతోపాటు సాధారణ పరిస్థితులు పునరుద్ధరణకు తీవ్రంగా కృషి చేసి విజయం సాధించారు. ఇక శ్రీకాకుళం ఆర్డీవోగా ఉన్నప్పుడే ఆ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా కూడా వ్యవహరించారు. శ్రీకాకుళం ఆర్డీవోగా ఉన్నప్పుడే కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టు, వంశధార ప్రాజెక్టు, నారాయణపురం కాలువకు సంబంధించిన భూసేకరణ, పునరావాస పనులను పర్యవేక్షించారు. రణస్థలం మండలం కొవ్వాడలో కేంద్రం తలపెట్టిన అణువిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి 1400 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు ఆ ప్రాంత రైతుల నుంచి సుమారు 600 ఎకరాలను భూములను సేకరించారు. దీని కోసం ప్రత్యేకంగా భూసేకరణ యూనిట్ ఏర్పాటు చేసినప్పటికీ రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మధ్య నష్టపరిహారం, పునరావాసం విషయంలో సమన్వయం కుదిర్చి ఆమోదయోగ్యమైన ఒప్పందం జరిగేలా అప్పటి ఆర్డీవో దయానిధి కృషి చేశారు. ఇక వంశధార ప్రాజెక్ట్ హిరమండలంలో ఉన్నప్పటికీ పునరావాస ప్రాంతాల్లో ఎక్కువ భాగం శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఉండటం వల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణం, నిర్వాసితులకు సౌకర్యాల కల్పన, పెండిరగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో చొరవ తీసుకున్నారు. వంశధార రిజర్వాయర్, నారాయణపురం ఆనకట్ట మధ్య హై లెవల్ కాలువ విస్తరణకు అవసరమైన అదనపు భూసేకరణ సమయంలో బాధిత రైతులకు తగిన పరిహారం లభించేలా మార్కెట్ విలువలను సవరించడానికి దయానిధి చొరవ తీసుకున్నారు. దాంతో వివాదాలకు తావు లేకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. అలాగే ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల గుర్తింపు, సేకరణ దయానిధి హయాంలోనే జరిగాయి. జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్‌కు కొత్త కాంప్లెక్ నిర్మాణానికి అవసరమైన భూమిని కూడా దయానిధి ఆధ్వర్యంలోనే జరిగింది. సిద్ధిపేట గ్రామానికి చెందిన ఐదు ఎకరాల గ్రామకంఠం భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడానికి, తద్వారా అటవీ శాఖ భూమికి కొత్త కలెక్టరేట్ కాంప్లెక్‌కు కేటాయించేలా చేశారు. సిద్దిపేట భూమిపై అనేక వివాదాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పరిష్కరించారు.
విశాఖ జిల్లాలో కీలక బాధ్యతలు
విశాఖ జిల్లాలోనూ పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన దయానిధి అదే సమయంలో ఎన్నికల విధులు కూడా నిర్వహించారు. సింహాచలం దేవస్థానం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూ రక్షణ)గా పనిచేస్తున్నప్పుడు 2012లో పాయకరావుపేట అసెంబ్లీ ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా. విశాఖ నేవీ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నప్పుడే 2014లో ఎలమంచిలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా పని చేశారు. 2023లో భారత ఎన్నికల సంఘం మణిపూర్ రాష్ట్రంలోని సైతు నియోజకవర్గ పరిశీలకుడిగా ఇతన్నే పంపింది.2024 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్వోగా, అదే సమయంలో అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారిగా పని చేశారు. బాధ్యత ఏదైనా న్యాయం చేయడంలో దిట్ట అని దయానిధి తన సమర్థతతో నిరూపించుకున్నారు.










Comments