top of page

సర్వేయర్లు కావాలి..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 4 days ago
  • 2 min read
  • 28 పోస్టుల్లో ఉన్నది కేవలం ఇద్దరే

  • సర్వే కోసం ఇతర మండలాల్లో విధులు

  • క్షేత్ర స్థాయిలో సమస్యలకు పరిష్కారం కరువు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

భూమి హద్దుల కొలతలు, సరిహద్దు వివాదాల పరిష్కారం, రిజిస్ట్రేషన్లకు ముందు భూ పరిశీలన వంటి కీలక పనులకు గ్రామ సర్వేయర్ పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది. అయితే శ్రీకాకుళం మండలంలో మాత్రం ‘గ్రామ సర్వేయర’ అనే పదం పేరుకే పరిమితమైంది. మండలంలో మంజూరైన 28 పోస్టులకు గాను ప్రస్తుతం కేవలం ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉండటంతో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు, సామాన్య ప్రజలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.

మండల పరిధిలో మొత్తం 28 సర్వేయర్ పోస్టులు ఉండగా, ఉన్నతాధికారుల డెప్యూటేషన్లు, కేటాయింపుల వల్ల మండలంలో కేవలం ఇద్దరు సర్వేయర్లు మాత్రమే మిగిలారు.

ముగ్గురు సర్వేయర్లు ప్రసూతి సెలవులో ఉండగా, డిప్యూటేషన్‌పై ఒకరు మంగళగిరికి, ఏడుగురు జేసీ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక యూనిట్‌కు వెళ్లారు. సింగుపురంలో ఒకరు, కిల్లిపాలెంలో ఒకరు విధులు నిర్వహిస్తుండగా, మిగిలిన 13 మంది ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, పోలాకి మండలాలకు రీ-సర్వే 2.0 విధు నిమిత్తం డిప్యూటేషన్‌పై వెళ్లారు.

పెండింగ్లో అర్జీలు

మండలంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వారానికి సగటున 40 భూ సమస్యల దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ఉన్న ఇద్దరు సర్వేయర్లు రోజుకు రెండు కంటే ఎక్కువ అర్జీలను పరిష్కరించలేకపోతున్నారు. ప్రతి వారం దరఖాస్తులు పెండింగ్ జాబితాలోకి చేరుతుండటంతో వారాల తరబడి భూముల హద్దులు తేలక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫీల్డ్ సర్వేలతో పాటు గ్రీవెన్స్, రెవెన్యూ క్లినిక్, చెరువులు-కాలువల ఆక్రమణలపై నివేదికలు, తహసీల్దార్ అత్యవసర పనుల భారం అంతా ఉన్న ఇద్దరిపైనే పడటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

రీ-సర్వే..పొరపాట్లు

ఉన్నతాధికారుల ఒత్తిడితో రీ-సర్వే ప్రక్రియను ఆదరాబాదరాగా చేపట్టడంతో క్షేత్రస్థాయిలో అనేక తప్పులు దొర్లాయి. వారసత్వంగా వచ్చిన భూములకు అసలైన యజమానుల పేర్లు కాకుండా కుటుంబంలో ఒక్కరి పేరిటే నమోదు చేశారు. వ్యవసాయ భూములను లే-అవుట్లుగా చూపించడంతో సబ్-డివిజన్ సమస్యలు తలెత్తాయి. వీటిని సరిదిద్దాల్సిన సర్వేయర్లు అందుబాటులో లేరు.

ఉన్నతాధికారులతో మాట్లాడించినా

స్వంత మండలంలో రీ-సర్వే, ఇతర భూ వివాదాలు పరిష్కరించడానికి సర్వేయర్లను తిరిగి తీసుకురావాలని మండల అధికారులు ప్రయత్నించారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారులతో మాట్లాడించినా ఫలితం దక్కలేదు. రీ-సర్వే పూర్తయ్యే వరకు (కనీసం మరో రెండు నెలల పాటు) సర్వేయర్ల డిప్యూటేషన్లను రద్దు చేసేది లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

రైతాంగం ఇబ్బందులు

సరిహద్దులు తేలకపోవడంతో సరిహద్దు రైతుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి.భూముల సమస్యలు తేలక ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆస్తులు విక్రయించుకోలేకపోతున్నారు. సర్వే నివేదికలు రాకపోవడంతో బ్యాంక్ రుణాలు, భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. ఆక్రమణలపై ఫిర్యాదులు చేసినా విచారణ చేపట్టేవారు కరువయ్యారు. అధికారులు తక్షణమే స్పందించి డిప్యూటేషన్లను రద్దు చేసి, శ్రీకాకుళం మండలానికి తగినంత మంది సర్వేయర్లను కేటాయిoచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page