top of page

సర్వీస్‌కే ప్రాధాన్యం.. ఆ పత్రాలకు పైరవీల పర్వం

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 26, 2025
  • 2 min read
  • స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు తీవ్ర పోటీ

  • ప్రజాప్రతినిధులు, నేతలను ఆశ్రయిస్తున్న అభ్యర్థులు

  • సర్వీస్‌ సర్టిఫికెట్లకు పెరిగిన గిరాకీ

  • వాటి కోసం సొసైటీలు, రూరల్‌ బ్యాంకులపై ఒత్తిడి

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

సెర్ప్‌ పరిధిలో స్త్రీనిధి సహాయ మేనేజర్‌ పోస్టులకు అభ్యర్థులు వేలంవెర్రిగా పోటీపడుతున్నారు. మెరిట్‌, సర్వీస్‌ ఆధారంగా తీసుకునే ఈ ఉద్యోగాల కోసం రాజకీయంగా అప్పుడే ప్రయత్నాలు జోరందుకున్నాయి. సర్వీస్‌ సర్టిఫికెట్లు కీలకం కావడంతో వాటిని సంపాదించడంతోపాటు ప్రజాప్రతినిధుల ద్వారా పోస్టులు దక్కించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

సెర్ప్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏపీ స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య పరిధిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 170 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో డిగ్రీ అర్హత, తెలుగు బాషలో ప్రావీణ్యం తప్పనిసరిగా పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగువేలకు పైగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందినట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా పరిధిలో స్త్రీనిధి మేనేజర్లుగా ముగ్గురు పని చేస్తున్నారు. వీరికి అదనంగా నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఉమ్మడి జిల్లాలో పది మంది అసిస్టెంట్‌ మేనేజర్లను నియమించనున్నట్లు సమాచారం. సాంకేతికంగా ఏడాది కాలానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నా భవిష్యత్తులో అంచెలంచెలుగా కొనసాగించడంతోపాటు హోదా పెరుగుతుందని భావిస్తుండటంతో ఈ పోస్టులకు నియోజకవర్గస్థాయిలో తీవ్ర పోటీ ఏర్పడిరది. వీటిని తమవారికి ఇప్పించుకునేందుకు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. పలువురు మంత్రుల పేషీల నుంచి కూడా పైరవీలు మొదలైనట్లు తెలిసింది.

సర్టిఫికెట్లకు గిరాకీ

అభ్యర్థుల అకడమిక్‌ అర్హతలతోపాటు సీనియారిటీ వెయిటేజ్‌, మైక్రోఫైనాన్స్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో అనుభవానికి 60 మార్కులు, సొసైటీలు, రూరల్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌లో అనుభవం ఉన్నవారికి గరిష్టంగా 15 మార్కులు ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీన్నే సద్వినియోగం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. సొసైటీలు, బ్యాంకింగ్‌లో పనిచేసిన అనుభవం లేకపోయినా.. ఉన్నట్లుగా సర్టిఫికెట్లు సంపాదించడానికి అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తు సమయంలోనే అర్హతలు, అనుభవం తదితర పత్రాలన్నీ అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నా.. దరఖాస్తు సమయంలో ఏదో ఒక అనుభవ పత్రాన్ని అప్‌లోడ్‌ చేసేసిన చాలామంది అభ్యర్థులు.. ఇంటర్వ్యూ నాటికి అసలు పత్రాలను సృష్టించి సమర్పించాలని భావిస్తున్నారు. వీటి కోసం సొసైటీలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే నాయకులను ఆశ్రయిస్తున్నారు.

బ్యాంకు అధికారులపై ఒత్తిడి

తమవారికి పోస్టింగ్‌ ఇప్పించుకునే క్రమంలో అభ్యర్థులకు సర్వీస్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ గ్రామీణ బ్యాంకుల అధికారులపై పడుతున్నారు. డీసీసీబీ, కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌, పీఏసీఎస్‌, ఆప్కాబ్‌ తదితర సంస్థల్లో అకౌంటెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, క్లర్క్‌ వంటి పోస్టుల్లో పని చేసినట్లు తమవారికి సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ ఆయా బ్యాంకుల సీఈవోలపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలే నేరుగా సొసైటీ సీఈవోలకు ఫోన్‌ చేసి అక్కడ పని చేసినట్టు అనుభవపత్రం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. పనిచేయవారికి అనుభవ పత్రం ఇవ్వలేమని సీఈవోలు మొత్తుకుంటున్నా వినిపించుకోవడంలేదని సమాచారం. దాంతో ఈ వ్యవహారం సొసైటీల సీఈవోలకు తలనొప్పిగా మారింది.

తమవారిని కూర్చోబెట్టేందుకు

మహిళల అభ్యున్నతి కోసం స్త్రీ నిధి సంస్థను 2011లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారాలు చేపట్టడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఈ సంస్థ రుణాలు మంజూరు చేస్తుంది. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి, జీవన ప్రమాణాల మెరుగుకు సహాయపడాలన్నది దీని లక్ష్యం. వైకాపా హయాంలో స్త్రీ నిధి ద్వారా గ్రామ, పట్టణ ప్రాంత మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం చేయూత పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం కింద స్వయం సహాయ సంఘాల సభ్యులకు 3 నుంచి 5 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. కేజీ నుంచి పీజీ వరకు చదువుకోవడానికి ఎన్టీఆర్‌ విద్యా సంకల్పం కింద రుణాలను ఇవ్వడానికి స్త్రీ నిధి ద్వారా అర్హులను గుర్తిస్తారు. ఈ రుణాలను డ్వాక్రా మహిళలు తమ పిల్లల చదువుకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణాన్ని మూడేళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని అసిస్టెంట్‌ మేనేజర్లు పర్యవేక్షిస్తారు. అర్హుల గుర్తింపు, రుణాల మంజూరు, రికవరీ తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకే నియోజకవర్గ స్థాయిలో కీలకమైన ఈ పోస్టుల్లో తమవారిని కూర్చోబెట్టేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం పైరవీలకు అవకాశం ఇవ్వొద్దని స్త్రీ నిధి అధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. 1:3 నిష్పత్తిలో షార్ట్‌ లిస్టు తయారు చేసి ఇంటర్వ్యూలకు పిలవాలని ఆదేశించినట్టు సమాచారం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page