top of page

‘హోం’ పదవి కావాలా.. నాయనా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 16 hours ago
  • 2 min read

‘నేనే హోం మంత్రి అయితే’.. ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్‌కల్యాణ్ నోటి నుంచి ఈ మాట తరచూ వినపడుతుంటుంది. దీనికి కొనసాగింపుగా ఆయన చేసే విపరీత వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చలకు తావిస్తుంటాయి. తాజాగా మరోసారి కాకినాడలో ఆయన ఇదే రీతిలో స్పందించడం, ఈసారి మరింత దూకుడుగా మాట్లాడుతూ తనది కాని శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానన్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘నేను హోంమంత్రిని కాను. అది క్రిమినల్స్ అదృష్టం. హోంమంత్రిగా ఉంటే నేరస్తులను వదిలిపెట్టేవాడిని కాను. హోంమంత్రిని కాకపోయినా ఉప ముఖ్యమంత్రిగా హోంశాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాను. ముఖ్యమంత్రికి కూడా చెప్పకుండా అవసరమైతే పోలీసు వ్యవస్థను నిలదీస్తాను’ అంటూ కాకినాడలో నిర్వహించిన ‘మాటా మంతి’ కార్యక్రమంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రికి కూడా చెప్పకుండా హోం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాననడం పరిధి మీరడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే హోం మంత్రిని అయి ఉంటే రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని తొక్కి నారా తీసేవాడిని, దురదృష్టవశాత్తు లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేదని పవన్ అనడమూ విశేషమే. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మాకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. వైకాపా గూండాలను తొక్కి నార తీస్తామని హెచ్చరించడం చూస్తే హోంశాఖను చేపట్టాలన్న కసి ఆయనలో తీవ్రంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. రెండేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కూడా పవన్ కల్యాణ్ ఇదే తరహాలో వ్యాఖ్యనిస్తూ ఓ ఘటన విషయంలో సీరియస్‌గా స్పందించారు. హోం మంత్రి వంగలపూడి అనితను హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు. ‘మీరు పట్టించుకోకపోతే హోం శాఖ పరిధిలో నేను కూడా పని చేయాల్సి ఉంటుంది’ అంటూ పరోక్ష సంకేతాలు పంపారు. ఇప్పుడు తాజాగా జన సైనికులతో నిర్వహించిన సమావేశంలో సైతం అలానే మాట్లాడారు. ఈసారి మరింత ముందుకెళ్లి సీఎంకు కూడా చెప్పాననడం కాస్త కలకలం రేపుతోంది. ఇవన్నీ చూస్తుంటే పవన్ మనసు హోంశాఖ మీదికి మళ్లినట్లు కనిపిస్తున్నది. 2024లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేనదే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌దే కీలకపాత్ర అనడంలో సందేహంలేదు. సాధారణంగా కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రులుగా, ఉప ప్రధానులుగా బాధ్యతలు చేపట్టేవారు హోంశాఖనే తీసుకుంటారు. ఎందుకంటే.. శాఖల్లో అదే అత్యంత పవర్‌ఫుల్. ముఖ్యమంత్రి, ప్రధాని తర్వాత ప్రోటోకాల్ పరంగానూ నెంబర్ టూ హోదా ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని పదవులన్నవి ఆరో వేలు లాంటివే. వాటికి రాజ్యాంగ హోదాగానీ, ప్రత్యేక ప్రోటోకాల్ గానీ ఉండవు. మిగతా మంత్రుల్లాగే కొన్ని శాఖలు మాత్రమే చేతిలో ఉంటాయి. అందువల్లే పవర్‌ఫుల్‌గా ఉండే హోంశాఖను ఆ పదవుల్లో ఉన్నవారు కోరుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ శాఖల కేటాయింపునకు ముందు తనకు హోంశాఖ అడిగారో లేదో తెలియదు గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణం వంటి ఆరు శాఖలు కేటాయించారు. ఆ తర్వాత పవన్ స్వయంగా తనకు ఆ శాఖలే ఇష్టమని, అందుకే కోరి మరీ వాటిని తీసుకున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ దీనికి విరుద్ధంగా అనేక సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హోంశాఖపై ఆయనకు మక్కువ పెరిగిందన్న అభిప్రాయాలకు తావిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కాకినాడ పర్యటనలో హోం శాఖ మీద ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. తాను కనుక హోం శాఖను తీసుకుని ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది అని కూడా అన్నారు. ఇది పరోక్షంగా మంత్రి అనిత మీద చేసిన కామెంట్స్ అని కూడా ప్రచారం జరిగింది. కొంత రాజకీయ చర్చ కూడా సాగింది. మళ్లీ ఇప్పుడు అదే కాకినాడ వేదికగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. మంత్రివర్గం అన్నది సమష్టి బాధ్యత కలిగి ఉంటుంది. రాష్ట్రస్థాయి అంశాలపై కలిసికట్టు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఒకరి శాఖలో మరోమంత్రి అనవసరంగా జోక్యం చేసుకోరాదు. ఏవైనా సమస్యలు ఉంటే ఆయా శాఖల మంత్రులు అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించాలి. లేదా కేబినెట్ సమావేశంలో పెట్టి మొత్తం మంత్రివర్గం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత రెండో ముఖ్యమంత్రి అనడానికి లేదు. మిగతా మంత్రులకంటే ఎక్కువగా భావించడానికి, వారి శాఖల్లో పెత్తనం చెలాయిస్తాననడానికి అసలు అవకాశం లేదు. ఒకవేళ అలా చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందంటున్నారు. పైగా మంత్రివర్గానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడైన సీఎంకు చెప్పకుండా హోంశాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానన్న పవన్ చెప్పడం దుందుడుతనం, రాజ్యాంగ ధర్మాన్ని విస్మరించడమే అవుతుంది. హోంమంత్రిని కాకపోయినా ఆ శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానని చెబుతున్న పవన్ ఎన్నికల ముందు ప్రచారపర్వంలో ప్రముఖంగా ప్రస్తావించిన 30వేల మంది మహిళల అదృశ్యం, సుగాలి ప్రీతి కేసులో అన్యాయం వంటి అంశాలను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నలు సహజంగానే వినిపిస్తున్నాయి. వీటిని పరిష్కరించడానికి హోంమంత్రి పదవే చేపట్టనవసరం లేదు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా, మంత్రివర్గ సహచరుడిగా కేబినెట్ భేటీలో వీటిని ప్రస్తావించి సత్వం న్యాయం జరిగేలా చొరవ చూపే అవకాశం ఉన్నా అలా జరగలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page