top of page

హతవిధీ.. ‘ఉపాధి’కీ పరిమతి!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 10 hours ago
  • 2 min read
  • ఉపాధి హామీ పనులకు రూ.50 లక్షల పరిమితి

  • కొత్త ఆంక్షలతో కాంట్రాక్టర్లు బెంబేలు

  • ఇప్పటికే దానికి మించి జిల్లాలో అనేక పనులు

  • ఆ బిల్లులను తిరస్కరిస్తున్న అధికారులు


    ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సీతను గీత దాటి బయటకు రావద్దంటూ నాడు లక్ష్మణుడు ఒక రేఖ గీశాడు. దాన్నే లక్షణరేఖ అంటారు. కానీ సీతమ్మ ఆ గీత దాటింది.. అవుటై రావణుకి చేతికి చిక్కింది. అలాగే కబడ్డీ తదితర క్రీడల్లో లైన్‌ దాటితే అవుటవుతారు. సరిగ్గా ఇలాంటి లక్ష్మణరేఖనే ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారులు గీశారు. నిధుల వినియోగానికి సంబంధించిన ఈ లక్ష్మణరేఖ దాటే కాంట్రాక్టర్లకు బిల్లలు అందే పరిస్థితి ఉండదు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో చేస్తున్న పనులకు ఇకనుంచి బిల్లులు రావడం కష్టమని ఇంతవరకు చెప్పుకున్నాం. దానికి కారణం.. ఏడాదికి రూ.254 కోట్లకే అనుమతులున్నా రూ.వెయ్యి కోట్ల పనులు చేపట్టడమే. దీనివల్ల నాలుగేళ్ల వరకు బిల్లుల గురించి ఆలోచించక్కర్లేదంటూ ‘ఆ పనులు చేస్తే మీ ఖర్మ’ అనే శీర్షికన కొద్దిరోజుల క్రితం ‘సత్యం’ ఒక కథనం ప్రచురించింది. ఇది శతశాతం వాస్తవమని ఆఫ్‌ ద రికార్డ్‌గా కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖ ఇంజినీర్లు అంగీకరించారు. ఇది చాలదన్నట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కాంట్రాక్టర్లకు ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చింది. రూ.50 లక్షల్లోపు పనులకు మాత్రమే ఎస్టిమేషన్లు వేయాలని, ఆ పరిమితి దాటిన పనులకు బిల్లులు రావని జాతీయ ఉపాధిహామీ పథకం అధికారులు స్పష్టం చేశారు.

తిరుగు టపాలో బిల్లులు

జిల్లాలో అనేకచోట్ల రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల పనులు ఒకే పద్దు కింద చేపట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రూ.50 లక్షల పరిమితి దాటి పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులను రిజెక్ట్‌ చేస్తున్నారు. ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ (ఎఫ్‌టీవో) కింద జనరేట్‌ అయి టోకెన్‌ ఇచ్చిన బిల్లులు కూడా ఇప్పుడు రూ.50 లక్షలు దాటిపోయాయంటూ వెనక్కు వచ్చేస్తున్నాయి. ఈ నిబంధన రెండు రోజుల క్రితమే అమల్లోకి వచ్చినట్టుంది. అంతకు ముందు రూ.50 లక్షలకు పైబడిన బిల్లులకు కూడా టోకెన్లు వచ్చాయి. కొద్ది రోజుల్లో తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని భావిస్తున్న సమయంలో అవి వెనక్కి వచ్చేశాయి. వాస్తవానికి ఏ ప్రభుత్వ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు మొదట కొంత పనిచేసి ఆ మొత్తానికి బిల్లు పెట్టి.. అది మంజూరైంది లేనిదీ చూసుకొని మళ్లీ ఆపిన చోట నుంచి పనులు మొదలుపెడతారు. అదే అమరావతి పనులకైతే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద ముందే కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి పనులు చేయిస్తున్నారు. రాజధాని నిర్మాణం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాబట్టి అక్కడ ఇది చెల్లుబాటు అవుతుంది. ఇది కాకుండా రాష్ట్రంలో మరే పనైనా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల నుంచే జరుగుతుంది. ఎందుకంటే.. ప్రతి వారం అప్పులకు వెంపర్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నిధుల్లో అధికశాతం రాజధాని నిర్మాణానికే కేటాయిస్తోంది. స్థానిక కాంట్రాక్టర్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాబట్టి చెల్లింపులకు ఢోకా ఉండదని భావించి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు చేపట్టడానికి ముందుకొచ్చారు.

సందిగ్ధంలో కాంట్రాక్టర్లు

వైకాపా హయాంలో రాష్ట్ర నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనులు చేయడానికి కాంట్రాక్టర్ల వద్ద నిధులు లేకుండాపోయాయి. కానీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన హామీ మేరకు ఉపాధిహామీ పథకం పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. అనుకున్నంత వేగంగా బిల్లుల చెల్లింపులు జరగకపోయినా ప్రభుత్వం ఏదో ఒక విధంగా కిందా మీదా పడి విడతలవారీగా బిల్లులు చెల్లిస్తోంది. దీంతో ఉపాధి పనులకు ఊపొచ్చింది. ఇప్పుడు తాజాగా రూ.50 లక్షల లోపు పనులే చేపట్టాలని, ఇంతవరకు అలా చేసిన పనులకే బిల్లులు చెల్లించాలని చెప్పడంతో జిల్లాలో అనేకమంది కాంట్రాక్టర్లు హతాశులయ్యారు. ఎందుకంటే.. కోట్ల రూపాయల పనులను ఎట్‌ ఎ స్ట్రెచ్‌గా చేపట్టారు. ఇందులో పార్ట్‌ పేమెంట్‌ కోసం బిల్లులు పెడితే రూ.50 లక్షలు దాటిపోయాయన్న కారణంతో తిరస్కరించారు. దాంతో మిగిలిన పనులు పూర్తిచేయాలా వద్దా అన్న సందిగ్ధంలో కాంట్రాక్టర్లు పడిపోయారు. దీనిపై ఉపాధిహామీ కమిషనర్‌ గానీ, ఆ శాఖ మంత్రిగానీ స్పష్టమైన హామీ ఇవ్వడంలేదు. కేంద్రంతో ముడిపడి ఉన్న సమస్య కావడమే దీనికి కారణం. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తే తప్ప పెద్ద పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపునకు నోచుకోవు. అలా అని రూ.50 లక్షల బిల్లులనైనా చెల్లిస్తున్నారా? అంటే.. అందులో అధిక శాతం ఎఫ్‌టివో వెనక్కు వచ్చేసింది. కొందరు మాత్రం తమకు రూ.50 లక్షల లోపు బిల్లులు జమయ్యాయని చెబుతున్నారు. ఎన్ని బిల్లులు చెల్లింపులకు నోచుకున్నాయి.. ఎన్ని మిగిలిపోయాయన్న వివరాలు డుమా వద్ద కూడా లేదు. ఇప్పుడు రూ.50 లక్షలు పైబడిన పనులు మందస, పలాస, జి.సిగడాం, హిరమండలం, లావేరు, పాతపట్నం, సోంపేట, వజ్రపుకొత్తూరు వంటి మండలాల్లో జరుగుతున్నాయి. ఇవికాకుండా సరుబుజ్జిలి మండలంలో రూ.3 కోట్లతో రోడ్డు వెడల్పు పని జరుగుతోంది. నిధుల తిరకాసుతో ఇప్పుడు ఈ పనులన్నీ సందగ్ధింలో పడ్డాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page