హరీ! పదవిని పంచుకోవాలి మరి
- NVS PRASAD
- 6 days ago
- 2 min read
నగర అధ్యక్షుడు పోస్టుకు పంపకాల కిరికిరి
మొదటి ఏడాది అధ్యక్షుడిగా కోరాడ
రెండున్నరేళ్లకు సర్వేశ్వరరావు
జిల్లా సంఘానికి కోరాడ సేవలు
తెగ్గొట్టి నెగ్గించిన కళింగకోమటి నేతలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం నగర కళింగకోమటి అధ్యక్షుడిగా కోరాడ హరిగోపాల్‌ను నియమిస్తూ ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు ప్రకటించారు. కాకపోతే ప్రమాణస్వీకారం చేసిన దగ్గర్నుంచి ఏడాది కాలంపాటే అధ్యక్షుడిగా ఉంటారని, ఆ తర్వాత ఊణ్ణ సర్వేశ్వరరావు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని గోవిందరాజులు తీర్పునిచ్చారు. స్థానిక కళింగవైశ్య కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగిన నగర సంఘం అధ్యక్షుడి ఎంపికలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం నాటికి మూడు ప్యానల్‌లు బరిలో ఉండటంతో అందర్నీ ఒప్పించడం కోసం కళింగకోమటి నేతలంతా సంయమనంగా వ్యవహరించారు. ముందుగా కోరాడ హరిగోపాల్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, ఆ తర్వాత రెండున్నరేళ్లు ఊణ్ణ సర్వేశ్వరరావు అధ్యక్షుడిగా ఉంటారని తీర్మానించారు. ఈమేరకు లిఖితపూర్వకంగా ఒక కాగితం మీద ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి కట్టుబడతామంటూ స్వయంగా హరిగోపాల్, ఊణ్ణ సర్వేశ్వరరావులు సంతకం చేయగా, మిగిలినవారు సాక్షి సంతకాలు చేశారు. తంగుడు రాజు, మళ్లా కల్యాణ్ చక్రవర్తి, అంధవరపు చైతన్యప్రభులు తాము కూడా పోటీలో ఉన్నామని ప్రకటించడంతో మరోసారి అవకాశమిస్తామని వీరిని మొదట పోటీ నుంచి తప్పించారు.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మొదటి ఏడాది కోరాడ హరిగోపాల్, ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు ఊణ్ణ సర్వేశ్వరరావు, మిగిలిన కాలపరిమితికి కోరాడ రమేష్‌లు అధ్యక్షులుగా ఉంటారని రాసుకున్నారు. కానీ ఎన్నికల వేదిక వద్ద మాత్రం కోరాడ రమేష్‌ను జిల్లా కార్యదర్శిగా నియమించడానికి తనకున్న రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అధికారాన్ని వాడుకుంటానని బోయిన గోవిందరాజులు స్పష్టం చేశారు. మొదటి ఏడాది కోరాడ హరిగోపాల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన వర్గం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా హరిగోపాల్‌కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విధంగా చక్రం తిప్పాలని అంధవరపు సంతోష్‌కు సూచించారు. ఆ మేరకే హరిగోపాల్ ఎన్నికకు మార్గం సుగమమైంది. బోయిన గోవిందరాజులు నచ్చజెప్పినా ఊణ్ణ సర్వేశ్వరరావు వెనక్కు తగ్గకపోవడంతో ఆయన కూడా రెండున్నరేళ్లు అధ్యక్షుడిగా పని చేస్తారని బోయిన తీర్మానించారు. ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నందున ఎవర్నీ కాదనలేకపోతున్నామని, అందుకే పదవీ కాలాన్ని పంచాల్సివస్తోందని బోయిన గోవిందరాజులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యేని విమర్శిస్తున్నవ్యక్తిపై అభిమానమెందుకు?
నగర కళింగకోమటి సంఘం నూతన అధ్యక్షుడ్ని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఆ సమావేశంలో పూర్వ అధ్యక్షుడు పీవీ రమణ లేకపోవడం బాధగా ఉందంటూ రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు పేర్కొనడంతో, కళింగకోమటి సంఘలో యువనాయకుడిగా ఉన్న శిల్లా మణికంఠ దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వయంగా స్థానిక ఎమ్మెల్యేపైనే విమర్శలు చేస్తూ ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి కోసం, అది కూడా ఈ సమావేశంలో లేనివారి కోసం బాధపడటం సరికాదని మణికంఠ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నేతలే అధ్యక్ష, కార్యదర్శులు కావాలని తీర్మానించుకున్న తర్వాత కూడా స్థానిక ఎమ్మెల్యేని విమర్శిస్తున్న వ్యక్తిని ఇక్కడ ప్రస్తావనకు తీసుకువచ్చి తమకు మనుగడ లేకుండా చేయడం సరికాదని గోవిందరాజులుకు మణికంఠ కౌంటరిచ్చారు.
Comments